కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగర ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ (Dump Yard) సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మా పాలకవర్గం పని చేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas)అన్నారు. సోమవారం కరీంనగర్‌లో బైపాస్‌లో ఉన్న నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును అధికారులతో కలిసి మేయర్ సందర్శించారు. కొద్ది రోజులుగా డంపింగ్ యార్డ్ అంటుకొని మంటలు చెలరేగి పొగ, దుర్వాసనతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో డంపింగ్ యార్డును తనిఖీ చేసి పరిశీలించారు. వ్యాప్తి చెందే మంటలు, పొగను వాటర్ ట్యాంకర్ల ద్వారా 3 రోజుల్లో అదుపు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డంపు యార్డులో కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బయోమైనింగ్ వేగవంతంపై ఏజెన్సీ, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
డంపింగ్ యార్డుకు ప్రతి రోజూ సుమారు 150 నుండి 180 మెట్రిక్ టన్నుల చెత్త చేరుతుండటంతో, పేరుకుపోయిన పాత వ్యర్థాలను త్వరగా తొలగించాలని ఆదేశించారు. బయోమైనింగ్ పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ.. నిర్దేశించిన గడువులోగా చెత్తను వేరుచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీని హెచ్చరించారు. ఈ సందర్భంగా మేయర్ (Karimnagar Mayor) మాట్లాడుతూ.. ప్లాస్టిక్, మట్టి, ఇతర వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి డంపింగ్ యార్డు సమస్య నుండి త్వరలో ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. బయోమైనింగ్ పనులు నిరంతరం కొనసాగేలా పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగకుండా, సమీప కాలనీల ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
డంపింగ్ యార్డ్ ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ఇటీవలే డంపింగ్ యార్డు ప్రక్షాళన కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం, స్వచ్చ్ భారత్ మిషన్ నుంచి మరిన్ని నిధులు విడుదల చేయాలని సీడీఎంకి లేఖ రాసినట్లు తెలిపారు. డంపింగ్ యార్డును పూర్తిగా క్లియర్ చేసి, ఆ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేలా సుందరీకరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ పనులు పూర్తయితే మానేరు నది పరివాహక ప్రాంతంలో కాలుష్యం తగ్గి, నగరవాసులకు ఊరట లభిస్తుందని తెలిపారు.
Read Also: కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవి రేసులో ఆది శ్రీనివాస్!
Follow Us On : WhatsApp

