Mobile Popup Ad
Mobile Popup Ad

‘దమ్ముంటే రాజీనామా చేయ్’.. మంత్రి లక్ష్మణ్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్!

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో సంక్షేమ శాఖ టెండర్ల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్ర సంక్షేమ శాఖలో భారీ కుంభకోణం జరిగిందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. సంక్షేమ శాఖ టెండర్లలో జరిగిన అవినీతిపై దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి లక్ష్మణ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

గత మార్చి నెలలో పిలిచిన టెండర్లలో స్థానికేతరులకు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మొత్తం 93 రకాల వస్తువుల సరఫరా కోసం కేటాయించిన 760 కోట్ల రూపాయలలో దాదాపు 200 కోట్ల రూపాయల మేర స్కాం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోందని, మొత్తం వ్యవహారంలో రెండు వేల కోట్ల రూపాయల వరకు కుంభకోణం దాగి ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. గతంలో స్థానిక వ్యాపారులకే టెండర్లు దక్కేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కమీషన్ల కోసం ఇతర రాష్ట్రాల వారికి ఈ కాంట్రాక్టులను కట్టబెట్టిందని మండిపడ్డారు.

సంక్షేమ శాఖలో జరిగిన ఈ టెండర్ల అక్రమాలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నిస్తే అధికార పక్షంలో ఎందుకు ఉలికిపాటు మొదలైందని ఆయన నిలదీశారు. తమ వద్ద ఈ అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఈ కుంభకోణంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వ స్కామ్‌లను ఎండగడతామని, సభలోనే నిలదీస్తామని హెచ్చరించారు. ఈ అవినీతి అంతా మంత్రి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే తప్పుకోవాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>