కలం, వెబ్ డెస్క్: బీచ్‌కు ఎవరైనా ఎందుకు వెళ్తారు? సరదాగా స్నేహితులతో ఎంజాయ్ చేసేందుకు.. లేదా కొద్దిసేపు ప్రశాంతంగా గడిపేందుకు వెళ్తారు. కానీ, ఎప్పుడైనా నిద్ర పోయేందుకు బీచ్‌కు వెళ్లే వాళ్లను చూశారా? నిద్ర పోయేందుకు ఎవరైనా బీచ్‌కు వెళ్తారా? అని నవ్వుకోకండి.. ముంబై (Mumbai)లోని వర్సోవా బీచ్ (Versova Beach)కు వెళ్తే మీకు అక్కడికి నిద్ర పోయేందుకు వచ్చే వందలాది మంది దర్శనమిస్తారు. ముంబైలో కొద్ది రోజుల నుండి తీవ్రమైన ఎండలు వేధిస్తున్నాయి. దీనికి తోడు రాత్రుళ్లు తరచూ కరెంట్ కోతల (Power Cuts)తో జనం అల్లాడిపోతున్నారు. ఈ ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందడం కోసం స్థానికులు ఇళ్లను వదిలి రాత్రి వేళల్లో వర్సోవా బీచ్‌కు చేరుకుంటున్నారు.
నగరంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో పాటు రాత్రిళ్లు కూడా వేడి తగ్గడం లేదు. దీనికి తోడు ముంబైలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఇళ్లల్లో ఉండలేక, చల్లటి గాలి కోసం ప్రజలు తమ కుటుంబాలతో కలిసి బీచ్ ఒడ్డునే రాత్రంతా గడుపుతున్నారు. సాయంత్రం వరకు పర్యాటకులతో రద్దీగా ఉండే వర్సోవా బీచ్ రాత్రయితే దుప్పట్లు పర్చుకొని నిద్రించే వారితో కిక్కిరిసిపోతోంది. చిన్న పిల్లలు, వృద్ధులతో సహా వందలాది మంది ప్రజలు సముద్ర తీరంలో పడుకుంటున్నారు. ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా కరెంట్ లేకపోతే నరకం కనిపిస్తోందని, అందుకే ఇక్కడికి వచ్చి పడుకుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ కోతలను నివారించాలని, ఈ తీవ్రమైన వేసవిలో తమను ఆదుకోవాలని ముంబైవాసులు కోరుతున్నారు.

