కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో సంచలనం రేపిన జ్యువెలరీ దోపిడీ కేసు (Jewellery Robbery Case)లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జిల్లా కేంద్రంలోని నగల దుకాణంలో ఈ నెల 3న జరిగిన సాహసోపేత దోపిడీ ఘటన అనంతరం నిందితుల కోసం మూడు రాష్ట్రాలలో విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలకు చెందినవారై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలు సమాచారం సేకరిస్తూ ముఠా కదలికలపై ఆరా తీస్తున్నాయి. దోపిడీ అనంతరం నిందితులు ఏపీ మార్గం ద్వారా పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
వారు రామడుగు మండలం మోతె రుద్రారం, ధర్మపురి, బీర్పూర్ అటవీ గ్రామాల మీదుగా తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. ప్రస్తుతం జగిత్యాల అటవీ ప్రాంతం (Jagtial Forest) కేంద్రంగా భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సుమారు 12 ప్రత్యేక బృందాలతో దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది గాలింపు చర్యలలో పాల్గొంటున్నారు. అటవీ ప్రాంతంలో ఒడిశా రిజిస్ట్రేషన్ నంబర్‌తో లభించిన ఓ బైక్.. కేసులో కీలక ఆధారంగా మారింది. ఈ వాహనం దోపిడీ ముఠా ఉపయోగించిందా లేదా అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
అటవీ పరిసర గ్రామాలలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. నిందితులు బీర్పూర్ లేదా కలమడుగు ప్రాంతాలలో తలదాచుకుని ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు సిరిసిల్ల వైపు నుంచి మంచిర్యాల, లక్షెట్టిపేట మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. పెగడపల్లి–నామాపూర్ మట్టి రోడ్ల మార్గంలో దుండగుల కదలికలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మూడు రోజులు గడిచినా నిందితులు పట్టుబడకపోవడంతో పోలీసు యంత్రాంగంపై స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు కీలక దశలో కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.
Read Also: విశాఖ రైల్వే జోన్ కల సాకారం: కేంద్రం గెజిట్ విడుదల
Follow Us On : WhatsApp

