epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కరీంనగర్ కు ‘‘ఆయుష్‘‘ మంజూరు

కలం, కరీంనగర్ బ్యూరో : ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న కరీంనగర్ (Karimnagar) లో “ఆయూష్” (Ayush) ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరి చేసింది. కరీంనగర్ లో ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు కోసం గత కొంత కాలంగా కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రూ.15 కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్న ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.7.5 కోట్ల నిధులు విడుదల చేసింది. కొత్తగా ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతో ఆయుర్వేదం, యోగా నేచురోపతి, యునాని, సిద్ద, హోమియోపతి వంటి చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణలో మూడు..

తెలంగాణలో వికారాబాద్(Vikarabad ), సిద్దిపేట(Siddipet), భూపాపల్లి( Bhupalpally) జిల్లాల్లో ఇప్పటికే ఆయుష్ ఆసుపత్రులు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో ఆయుష్ సేవల పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నట్లు తేలడంతో కరీంనగర్ లో ‘ఆయుష్’ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ‘ఆయుష్’ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. స్థల ఎంపిక ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతో పాటు డాక్టర్లు, సిబ్బందిని నియామక బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుష్ అధికారులతో చర్చించారు.

అందుబాటులోకి రానున్న వైద్య సేవలు..

50 పడకల ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటైతే ఆయుర్వేద, హోమియోపతి, యోగా నేచురోపతి, యునాని, సిద్ద వైద్య చికిత్స సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు ప్రసూతి, స్త్రీ రోగ చికిత్సలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు కాయకల్ప చికిత్స, పంచకర్మ, శల్య, శాలాక్య వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 50 పడకల ఆసుపత్రిలో కాయచికిత్సకు 20, పంచకర్మ చికిత్సకు 10, శల్య సేవలకు 10, ఈఎన్టీ, ప్రసూతి, స్త్రీ ఆరోగ్య సేవలకు 5 పడకలను కేటాయించనున్నారు. ప్రతి విభాగానికి అర్హత, అనుభవం ఉన్న ఆయుష్ వైద్యులతో పాటు యోగా ట్రైనర్ ఉంటారు.

ఆయుర్వేదంకు సంబంధించి … పంచకర్మ చికిత్సలు (వమన, విరేచన, బస్తి మొదలైనవి) చర్మ, జాయింట్, జీర్ణక్రియ, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. యోగా & నేచురోపతి విభాగంలో యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి సేవలతోపాటు జీవనశైలి మార్పులు, స్ట్రెస్, షుగర్, బీపీ నియంత్రణకు సంబంధించి పై కౌన్సిలింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హోమియోపతి విభాగానికి సంబంధించి హోమియోపతి డాక్టర్లు, పిల్లలు, మహిళలు, అలర్జీ, ఆస్తమా, మైగ్రేన్ చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. డిమాండ్ ను బట్టి సిద్ద, యునానీ సేవలు కూడా ప్రారంభిస్తారు. రోజువారీ వైద్య సేవలు (OP), డైట్ న్యూట్రిషన్ సలహాలు, ఆరోగ్య అవగాహన శిబిరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ పరిష్కార సేవలు ఆయుష్ ఆసుపత్రి ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>