Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో సీపీఎం నేతల ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వతంత్రంగా వ్యవహరించకుండా, మోదీ ప్రభుత్వం జేబు సంస్థల్లా మార్చి ప్రతిపక్ష నాయకులపై దాడులు సాగిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఇంటిపై ఈడీ దాడులు చేయించిందని ఆరోపించింది. కరీంనగర్ (Karimnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గీతాభవన్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ… సీబీఐ, ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ దుర్వినియోగం చేస్తూ, ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందన్నారు. అంబానీ, అదానీ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తే వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమ సొమ్ము దొరకదా.. అని ప్రశ్నించారు.

విజయన్‌కు ఏం సంబంధం..?

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సీపీఎం నేతలపై ఒక్క కేసు కూడా లేదని, తమది విలువలతో కూడిన పార్టీ అని మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికల బాండ్లు సేకరించలేదన్నారు. ప్రైవేట్ మైనింగ్ కంపెనీ నుంచి విజయన్ కుమార్తెకు చెందిన సంస్థకు అక్రమంగా రూ.1.72 కోట్లు బదిలీ చేశారని అభియోగం మోపారన్నారు. దీన్ని విజయన్ కుమార్తె వీణా ఎప్పుడో ఖండించారని గుర్తు చేశారు. ఈ కేసులో విజయన్‌కు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవని న్యాయస్థానాలు సైతం తేల్చి చెప్పాయన్నారు. ఒక పథకం ప్రకారం పెద్ద కుట్రకు పాల్పడ్డారన్నారు.

బీజేపీ ఫాసిస్ట్ పద్ధతిలోకి రాష్ట్రంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కూడా చేరిందని… బీజేపీ, కాంగ్రెస్ మధ్య అపవిత్ర కూటమికి నిదర్శమని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, అసోం సీఎంలు సువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మ బీజేపీల్లో చేరగానే.. వారిపై ఈడీ కేసులు లేవన్నారు. ఈడీలకు, బేడీలకు, మోడీలకు భయపడే పార్టీ సీపీఎం కాదని హెచ్చరించారు. ఈ నిరసనలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, నాయకులు తిప్పారపు సురేష్, గజ్జల శ్రీకాంత్, రాయి కంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, మాతంగి శంకర్, రత్నం సురేష్, సందేశ్, రాకేష్, సన్నీ పాల్గొన్నారు.

Read Also: జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>