కలం, కరీంనగర్ బ్యూరో : టీజీఎండీసీ సిబ్బంది ఇసుక క్వారీ వద్ద ఇసుక లోడింగ్ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలనీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ (Karimnagar) కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy), పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (Goush Alam) హెచ్చరించారు. ఇసుక రవాణా సందర్భంగా అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
సోమవారం వీణవంక మండలం చల్లూరులోని టీజీఎండీసీ (TGMDCS) ఇసుక క్వారీ వేయింగ్ బ్రిడ్జి పనితీరును జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుక లారీ లోడింగ్ వేయింగ్ ను స్వయంగా పరిశీలించారు. క్వారీ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వే బిల్లులు డీడీలు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి లారీ ఇసుక లోడింగ్ కు వచ్చే సమయంలో లారీలను వేయింగ్ చేయాలని లోడింగ్ అయిన తర్వాత మళ్లీ ఒకసారి వేయిట్ చేయాలని సూచించారు.
ఇసుక రవాణా చేసే ప్రతి లారీ ఎంట్రీ ఎగ్జిట్ వివరాలను సాండ్ ఆడిట్ యాప్ లో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. రికార్డుల్లో ఎలాంటి తేడాలు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. ఇసుకను తరలించే సమయంలో లారీ డ్రైవర్లు తప్పనిసరిగా ఇసుకపై టార్పాలిన్ కవర్లు కప్పి తీసుకెళ్లాలని సూచించారు. దీనివల్ల ఇసుక రోడ్డుపై పడకుండా ఉంటుందని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. కస్టమర్లు డిడి చెల్లించిన ప్రకారం ఇసుక లోడింగ్ చేయాలని ఎక్కడైనా తేడాలు వస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ విషయంలో క్వారీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఇసుక లారీల డ్రైవర్లు అన్ని జాగ్రత్తలు పాటించాలనీ సూచించారు. లోడింగ్ వెయిటింగ్ చేసే సమయంలో సిసి కెమెరాలో రికార్డు అయ్యేలా పర్యవేక్షించాలని ఆ మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రతిదీ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు
అంతకుముందు వీణవంక మండలం మామిడాల పల్లి, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామాల్లో ఇసుక చెక్ పోస్టులను కలెక్టర్, సీపీ పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి ఇసుక లారీ కి సంబంధించిన వే బిల్లులు డీడీలు జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశించారు. తద్వారా అక్రమ రవాణా చేసే వాహనాలను నిమంత్రించాలని పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణా అక్రమ ఇసుక నిల్వలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని ఈ మేరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం సూచించారు. వీరి వెంట ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, హుజురాబాద్ ఏసీపీ మాధవి, వీణవంక మానకొండూరు తహసీల్దార్లు అనుపమ, విజయ్ టీజీఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
Read Also: కవిత నేరెళ్లకు రావద్దు.. జాగృతి బాధితుల సంఘం హెచ్చరిక
Follow Us On : WhatsApp


