epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘క్లాట్’​ పేపర్​ లీక్​.. సుప్రీంలో పిటిషన్​ దాఖలు

కలం, వెబ్​డెస్క్​: ‘క్లాట్’​ పరీక్ష (CLAT 2026) రాసి ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు షాక్​. ఈ నెల 7 నుంచి దేశవ్యాప్తంగా లా యూనివర్సిటీల్లో యూజీ, పీజీ లా కోర్సులకు కౌన్సెలింగ్​, సీట్ల కేటాయింపు ప్రారంభం కానుండగా, క్లాట్​ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. పరీక్ష కంటే ముందే ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ.. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతోపాటు వాట్సాప్​, టెలిగ్రామ్​ తదితర వాటిల్లో వచ్చిన క్వశ్చన్​ పేపర్, సమాధాన పత్రాల స్క్రీన్​షాట్లను కోర్టుకు పిటిషన్​దార్లు సమర్పించారు.

దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, అంతవరకు  కౌన్సెలింగ్​, సీట్ల కేటాయింపు నిలిపివేయాలని కోరారు. పేపర్​ లీక్​ నిజమని తేలితే పరీక్ష రద్దు చేయాలని, స్వతంత్ర కమిటీ పర్యవేక్షణలో తిరిగి పరీక్ష నిర్వహించాలని విన్నవించారు. క్లాట్​–2026 పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ, ఇతర ఓబీసీకి చెందిన కొందరు అభ్యర్థులు ఈ పిటిషన్​ దాఖలు చేశారు.

కాగా, దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఇతర లా వర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా కామన్​ లా అడ్మిషన్​ టెస్ట్​(క్లాట్​) నిర్వహిస్తారు. నిరుడు డిసెంబర్​ 7న క్లాట్​ పరీక్ష (CLAT 2026) జరిగింది. 25 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 156 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 5వేల సీట్లకు 92వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అనంతరం అదే నెల 16న ఫలితాలు వచ్చాయి. అయితే, పరీక్ష జరగడానికి ముందు రోజే.. అంటే డిసెంబర్​ 6న ప్రశ్నపత్రం, సమాధానాలు వివిధ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​లో బయటికి వచ్చినట్లు ప్రచారం జరిగింది.

దీంతో నేషనల్​ లా యూనివర్సిటీల కన్సార్షియం.. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా నేతృత్వంతో గ్రీవెన్స్​ రెడ్రెసల్​ పోర్టల్​ ఏర్పాటుచేసింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి విచారణ నివేదిక గానీ, స్పష్టీకరణ గానీ విడుదల చేయలేదని పిటిషనర్లు ఆరోపించారు. పోర్టల్​ ద్వారా ఫిర్యాదు చేసిన అభ్యర్థులకు స్పందన రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ప్రజల్లో అనుమానాలు పెరిగాయని, ప్రక్రియపై నమ్మకం దెబ్బతిందని పిటిషన్​లో పేర్కొన్నారు.

Read Also: తమిళనాట సంచలనం.. విజయ్‌తో కమలం దోస్తీ ?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>