కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో 96 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం సేకరించామన్నారు. ఈ యాసంగికి సంబంధించి 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి రాగా 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
రైతులకు రూ.628 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవడంతో 236 కేంద్రాలను అధికారులు మూసివేశారని, ఈనెల 6వ తేదీలోగా మిగిలిన 81 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
మొత్తంగా మరో మూడు రోజుల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో, మానకొండూర్ నియోజకవర్గంలోని మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నూరు శాతం పూర్తి కావడంతో అన్ని కొనుగోలు కేంద్రాలను మూసి వేసినట్లు వివరించారు.
చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం నుండి 3,16,926 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, 95% తరలింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం 13,139 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ ప్రక్రియ మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు.

