కలం, వెబ్ డెస్క్: కూకట్‌పల్లి (Kukatpally) సీసీఎస్, జగద్గిరిగుట్ట (Jagadgirigutta) పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నగరంలో ఓ ఫేక్ పోలీసు ముఠా (Fake Police Gang)ను అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి ఈ ఆపరేషన్‌కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు రఘు వర్మ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. ఆరుగురు సభ్యులతో నాగరాజు సూడో పోలీస్ వ్యవస్థను నడిపినట్లు వెల్లడించారు.
నాగరాజు తాను ఐపీఎస్ ఆఫీసర్ అని నమ్మించి తన బృందంతో మే 18న కూకట్‌పల్లికి చెందిన పూర్ణచందర్ రావును కిడ్నాప్ చేశాడు. అనంతరం పూర్ణ చందర్‌ను ఓ కారులో సూర్యాపేటకు తీసుకెళ్లారు. అక్కడ అతడి దగ్గర రూ.1 లక్ష వసూలు చేశారు. పూర్ణ చందర్‌ను తిరిగి హైదరాబాద్‌లో వదిలేసి మరో రూ.5.26 లక్షలు అతడి నుంచి తీసుకున్నారు. గతంలో నాగరాజు కల్నల్‌గా కూడా చెలామణి అయ్యాడు. నాగరాజుపై 12 కేసులు, 2 పీడీ యాక్ట్‌లు, భీమవరంలో రౌడీషీట్ కూడా ఉన్నాయి. ఈ కేసులో నాగరాజు, రాహుల్, సత్యభాన్ సింగ్, నాగేంద్రవర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ప్రదీప్ మిశ్రా, సునీల్ కుమార్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 2 గన్‌లు, ఎయిర్ పిస్టల్, పోలీసు డ్రెస్‌లు, 10 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

