కలం, కరీంనగర్ బ్యూరో : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) అధికారులను ఆదేశించారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కరీంనగర్ నగరంలోని 46వ డివిజన్ ప్రగతినగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పరిశీలించారు.
బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల సేకరణ చేపడుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ‘ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు.. ఎన్ని గంటలకు ప్రారంభించారు, కార్యాచరణ ప్రణాళిక ఎలా రూపొందించుకుంటున్నారు. త్వరగా పూర్తి చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు’ అని జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు.
కలెక్టర్ ఓటర్లతోనూ మాట్లాడుతూ.. బీఎల్వోలు, సూపర్వైజర్లు విధుల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించుకుంటే కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అవసరమైతే ఇతర శాఖల సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) తెలిపారు. మహిళా సంక్షేమ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఒక నిర్దిష్ట షెడ్యూల్, ప్రణాళిక ప్రకారం ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయాలని, అర్హులైన ప్రతి ఓటరుకు సమాచారం చేరేలా చూడాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ రాజేష్, సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు.
Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా
Follow Us On: X(Twitter)

