కలం, కరీంనగర్ బ్యూరో: దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) కొనియాడారు. ఎం.భాగ్యరెడ్డి వర్మ(Bhagya Reddy Varma) 138వ జయంతి వేడుకలను శుక్రవారం కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద ఉన్న భాగ్యరెడ్డి వర్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ తో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యకు, ప్రగతికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు.
భాగ్యరెడ్డి వర్మ హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. మహనీయులను గౌరవించుకోవడంతో పాటు వారి స్పూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

