Mobile Popup Ad
Mobile Popup Ad

సమర్థవంతంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక : కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారుడికి అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector Chitra Mishra) అన్నారు. జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమర్థవంతంగా జరిగిందని, క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా 10 అంశాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రతి గ్రామం పర్యటించి ప్రజలతో మమేకమయ్యారని, వారి సమస్యలు తెలుసుకున్నారని, అవసరాలను గుర్తించారని పేర్కొన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సభలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు శిక్షణ, సంక్షేమం, అవగాహన సదస్సులు వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు ప్రజా సమస్యలను తెలుసుకున్నారని, వాటి పరిష్కారానికి ప్రణాళికతో ముందుకు వెళ్తామని వివరించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు, ప్రజా అవసరాలను గుర్తించామని తెలిపారు.

ప్రతి చివరి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరేవరకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. గ్రామస్థాయిలో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం అభివృద్ధిని ప్రోత్సహించాలని అన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>