Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ

కలం, ఖమ్మం బ్యూరో: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, తీసుకున్న అప్పుల ఈఎంఐలు కట్టలేక దొంగగా మారిన ఒక అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్‌ను ఖమ్మం అర్బన్ పోలీసులు (Khammam Police) చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. వృత్తి రీత్యా జిమ్ ట్రైనర్ అయిన అఖిల్(29) స్వస్థలం గుంటూరు జిల్లా నల్లపాడు సమీపంలోని అంకిరెడ్డి పాలెం. జిమ్ ట్రైనర్‌గా వచ్చే సంపాదన తన విలాసాలకు, ఈఎంఐలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌ల బాట పట్టాడు. గురువారం నగరంలోని శ్రీరాం నగర్ రోడ్డు నెం.7లో ఆటో దిగి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలోని బంగారు చైన్‌ను గమనించాడు. ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి.. ఆమె వద్దకు వెళ్లి మెడలోని చైన్‌ బలవంతంగా లాక్కున్నాడు. బైక్ ఎక్కి పారిపోయే క్రమంలో గొలుసు చేతిలో నుంచి జారి కింద పడిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శుక్రవారం అదే విధంగా చైన్ స్నాచ్ చేద్దామనే ఉద్దేశంతో ఖమ్మం వస్తుండగా పోలీసులకు చిక్కాడని ఏసీపీ తెలిపారు.

అక్కడ గుర్తుపడుతారని.. ఖమ్మంకు మకాం

​అఖిల్‌పై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కర్లపాలెం, పల్నాడు జిల్లా నర్సరావుపేట, ఒంగోలు జిల్లా అద్దంకి, గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్లలో పలు చైన్ స్నాచింగ్ కేసులు నమోదై ఉన్నట్లు ఏసీపీ రమణమూర్తి పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు, ప్రజలు తనను చూస్తే గుర్తుపడతారనే భయంతో, ఖమ్మం పట్టణానికి మకాం మార్చాడని వివరించారు. ఒంటరి మహిళలు, వృద్ధులు ఇలాంటి నేరగాళ్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్త వహించాలని ఏసీపీ కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ రమణమూర్తి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>