కలం, కరీంనగర్ బ్యూరో: ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన దేశ హితం కోసమే కొనసాగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆంటోనీ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో (Karimnagar) వివిధ జోన్లలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో జూన్ 10, 2026 ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారన్నారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి అనేక చారిత్రకమైన, సాహసోపేతమైన సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. డిజిటల్ విప్లవం, డిజిటల్ పేమెంట్స్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందన్నారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు నాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 12 ఏళ్లలో భారతదేశం సగటున 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 2001 అక్టోబర్ నుంచి 2014 మే వరకు దాదాపు 4,610 రోజులు పాలకుడిగా మోదీ సేవలు అందించారని కొనియాడారు.

