Mobile Popup Ad
Mobile Popup Ad

“భార్యాభర్తల పంచాయతీ”లా కాంగ్రెస్-బీజేపీ.. జగదీశ్ రెడ్డి సెటైర్

కలం, నాగార్జునసాగర్ : రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాటకాలాడుతున్నాయని బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ తోడుదొంగలంటూ ఆరోపించారు. హాలియా మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో నిర్వహించిన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిల మధ్య వ్యవహారం “భార్యాభర్తల పంచాయతీ”లా ఉందని ఎద్దేవా చేశారు. పైకి ఒకరినొకరు విమర్శిస్తున్నట్లు కనిపించినా, అంతర్గతంగా ఇద్దరి మధ్య పూర్తి అవగాహన ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడూ ప్రధాని మోదీని  విమర్శించకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్-బీజేపీలు కలిసి రాజకీయ డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత క్రియాశీలకంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ సర్వే (SIR) ప్రక్రియతో పాటు పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలు సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>