కలం, వెబ్ డెస్క్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి (Kalwakurthy) పట్టణంలో గురువారం విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. భర్త మరణంతో మనస్తాపానికి గురైన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె మృతి చెందగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ప్రసన్న (40) అనే మహిళ తన కుమార్తె (13), కుమారుడు (15)తో కలిసి నివసిస్తోంది. గత నవంబర్‌లో ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో ప్రసన్న తీవ్ర మానసిక క్షోభకు గురైంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి కారణాలతో ఆమె మనసు కలత చెందింది.
ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ప్రసన్న తన పిల్లలతో కలిసి అన్నం తినే సమయంలో పురుగుల మందును ఆహారంలో కలిపింది. దీంతో ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించి వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రసన్న, ఆమె కుమార్తె మృతి చెందారు. 15 ఏళ్ల కుమారుడు ప్రస్తుతం విషమ పరిస్థితిలో ఉండటంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కల్వకుర్తి (Kalwakurthy) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: ఆ సంతకమే కొంపముంచింది : రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram


