కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరంలో విపరీతంగా అక్రమ సంపాదనకు తెగబడుతున్నారని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. భూములు, పర్మిషన్లు, టీడీఆర్ పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. భూదాన్ ఉద్యమం స్ఫూర్తితో విద్యార్థుల కోసం అయ్యప్ప సొసైటీలోని ఖానామెట్‌లో సుమారు 700 అక్రమ భవనాలకు పర్మిషన్లు ఇచ్చారని.. అక్కడ రెండు భవనాల మధ్య కనీసం అగర్ బత్తి పట్టేంత స్థలం కూడా లేదన్నారు.
ఇప్పటికే కాలేజీలు, పీజీ హాస్టల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయని.. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే నష్టం ఊహించలేమని కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల్లోగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అక్రమ భవనాలపై చర్యలు తీసుకోకపోతే.. తామే రెడ్ మార్క్ వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు అక్కడ భూములు కొనవద్దని హెచ్చరించారు. కేవలం నోటరీలతోనే పది ఫ్లోర్ల వరకు అనుమతులు ఇస్తున్నారంటేనే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందనేది అర్థమవుతోందన్నారు.
నిరూపిస్తే ప్రభుత్వానికే ఇచ్చేస్తా..
తన వద్ద అంగుళం అసైన్డ్ భూమి, ఇనాం భూమి ఉన్నట్లు నిరూపిస్తే వెంటనే ప్రభుత్వానికే ఇచ్చేస్తానని కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సవాల్ విసిరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చి కరువు గురించి మాట్లాడి సాయం చేస్తారని భావించామని.. రాజకీయాలు మాట్లాడి వెళ్లిపోయారని విమర్శించారు. హైదరాబాద్‌కు పైసా ఇవ్వనివారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు.
దేశంలో 13 కోట్ల మంది విదేశీయులు ఉన్నారని చెబుతున్న అమిత్ షా(Amit Shah).. వారి ఓట్లతోనే గెలుస్తున్నారా.. అని కవిత అనుమానం వ్యక్తం చేశారు. పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి చెబుతుంటే.. మంత్రి తుమ్మల మాత్రం అలా అనలేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాక రైతులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ మహిళల కోసం మహిళలే నడిపిస్తున్న పార్టీ అని.. మహిళా గ్రాడ్యుయేట్లు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
Also Read : పోలీసులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: X(Twitter)

