కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ‘యెన్నం హెల్త్ కిట్స్’ పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పట్ల ప్రజల్లో నమ్మకం, ఆసక్తి పెరిగాయని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన వివిధ వస్తువులతో కూడిన ‘యెన్నం హెల్త్ కిట్స్’ను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్ 14వ తేదీన తన సొంత నిధులతో ‘యెన్నం హెల్త్ కిట్స్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రజలు మరింతగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసం కల్పిస్తూ, తల్లులు, నవజాత శిశువులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

