కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha), ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉదంతం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై స్పందించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఇరు నేతలు హైదరాబాద్లోని గాంధీ భవన్కు వచ్చి వివరణ ఇవ్వాలని టీపీసీసీ నాయకత్వం ఆదేశించింది.
అయితే ఈ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటికీ హాజరుకాలేదు. మరోవైపు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్యాహ్నం టీపీసీసీ విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించానని, ఆ ఘటనకు సంబంధించి స్పష్టమైన ఆధారాలను విచారణలో సమర్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. నేతల మధ్య నెలకొన్న ఈ ఆధిపత్య పోరుపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

