కలం, తెలంగాణ బ్యూరో : జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్‌లో చేరడం ఆ పార్టీలోనే కాక కల్వకుంట్ల ఫ్యామిలీలోనే (Kalvakuntla Family) పొలిటికల్ వార్‌కు దారితీసింది. జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌కు అదనంగా ఒరిగేదేమీ లేదని, ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ అని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వ్యాఖ్యానించారు. కొద్దిమంది బీఆర్ఎస్ లీడర్లలో సైతం ఆయన చేరికతో ఇప్పుడు పార్టీకి అదనంగా వచ్చే మైలేజీ ఏముంటుందనే అభిప్రాయం నెలకొన్నది. ఇక ఆయనను చేర్చుకుని బీఆర్ఎస్ నైతికంగా పెద్ద తప్పు చేసిందని కల్వకుంట్ల కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. ఆయన చేరిక ఇష్టం లేకనే బహిరంగసభ వేదికపై ఉండొద్దన్న ఉద్దేశంతో హరీశ్‌రావు ఢిల్లీ వెళ్ళారన్న మాటలూ వినిపించాయి. హరీశ్‌రావు గైర్హాజరు కావడంతో కేటీఆర్‌ను సైతం దూరంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లు గుసగుసలూ వినిపించాయి. ఒక్క జీవన్‌రెడ్డి చేరిక కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ చిచ్చును రాజేసినట్లయింది.
పార్టీలో పెద్ద పదవి ఇస్తామన్న కేసీఆర్ :
జీవన్‌రెడ్డికి పార్టీలో పెద్ద పదవి ఇస్తానని, జగిత్యాలకు పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్త బాధ్యతలు అప్పజెప్తామని కేసీఆర్ ఆ బహిరంగ సభ వేదికగా ప్రకటించడం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఉద్యమకాలం నుంచి ఉన్న సీనియర్లను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన జీవన్‌రెడ్డికి కేసీఆర్ ఆఫర్ ఇవ్వడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికే పార్టీలో యూటీ (ఉద్యమ తెలంగాణ) బ్యాచ్, బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్ అనే విభజన మాటల్లో వినిపిస్తున్నది. ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని బీటీ బ్యాచ్‌గా అప్పట్లో ఒరిజినల్ లీడర్లు ట్యాగ్ లైన్ తగిలించారు. ఇప్పుడు జీవన్‌రెడ్డి ఎపిసోడ్ కూడా ఆ తరహా చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌లో కేవలం పదవి, అవకాశాల కోసమే వివాదాస్పదుడు అయ్యారని, ఇప్పుడు ఆ తరహా పరిస్థితి బీఆర్ఎస్‌లోనూ నెలకొంటుందనే అనుమానాలు మొలకెత్తుతున్నాయి.
తెలంగాణ వ్యతిరేకికి ఉద్యమ పార్టీలో స్థానమా? : కవిత
జీవన్‌రెడ్డిని చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో పైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన జీవన్‌రెడ్డిని జగిత్యాల గడ్డమీద రాజకీయంగా సమాధి చేస్తామని సవాల్ చేశారు. ఇదే తరహాలో కల్వకుంట్ల కవిత సైతం జీవన్‌రెడ్డిని చేర్చుకున్న బీఆర్ఎస్ నిర్ణయాన్ని తూర్పారబట్టారు. ఏడు పదులు దాటిన కురువృద్ధుడిని చేర్చుకుని కేసీఆర్ (KCR) రాజకీయ పునరేకీకరణగా చెప్పుకోడాన్ని తప్పుపట్టారు. తెలంగాణ వ్యతిరేక శక్తులను చేర్చుకుని పునర్నిర్మాణ యజ్ఞం అని కేసీఆర్ చెప్పుకోడాన్ని ఎద్దేవా చేశారు. వెయ్యేండ్లయినా బీఆర్ఎస్ పార్టీ మారదని, ఆ పార్టీ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో మేధావులు, విద్యావేత్తలు అర్థం చేసుకోవాలన్నారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని, ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తుచేశారు.
కేటీఆర్, హరీశ్ మధ్య జీవన్‌రెడ్డి వివాదం :
జీవన్‌రెడ్డిని పార్టీలోకి రావాల్సిందిగా కేటీఆర్ (KTR) జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్ళి ఆహ్వానించారు. ఆ తర్వాత ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. ఆయన చేరికను ఉత్తర తెలంగాణలో హైలైట్ చేసుకునేలా జగిత్యాల బహిరంగసభకు శ్రీకారం చుట్టారు. కానీ ఆయన చేరికపై భిన్నాభిప్రాయం ఉన్నందునే హరీశ్‌రావు (Harish Rao) గైర్హాజరయ్యారని, సుప్రీంకోర్టు పని పేరుతో ఢిల్లీ వెళ్ళిపోయారన్న వార్త గులాబీ కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది. చివరకు పార్టీ జోక్యం చేసుకుని అఫీషియల్ ప్రకటన ఇవ్వకతప్పలేదు. హరీశ్‌రావు అలకను దృష్టిలో పెట్టుకుని డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా కేటీఆర్‌ను సైతం వేదిక ఎక్కకుండా కేసీఆర్ స్ట్రాటెజీ ప్లే చేశారన్న చర్చలు పార్టీలో చోటుచేసుకున్నాయి. ఒక్క జీవన్‌రెడ్డి ఎపిసోడ్ మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీలోనే (Kalvakuntla Family) వివాదానికి దారితీసింది. రానున్న రోజుల్లో అది ఏ టర్న్ తీసుకుంటుందనే ఆందోళనా లేకపోలేదు.
Read Also: బోగస్ ఉద్యోగుల ఏరివేతకు సర్కార్ ప్లాన్
Follow Us On: WhatsApp

