కార్యకర్తకు రాజగోపాల్ రెడ్డి కన్నీటి నివాళి.. రాహుల్ గాంధీ అరెస్ట్ పై ఫైర్..!

కలం, తుంగతుర్తి : ఇటీవల ప్రమాదంలో మరణించిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకుడు ఎలుగు యాదయ్య కుమారుడు సందీప్ మృతి చెందడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాదయ్య దంపతులను ఓదారుస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

సందీప్ మృతిపై సంతాపం ప్రకటించడంతో పాటు రాహుల్ గాంధీ అరెస్టు, పార్టీలోని అంతర్గత పరిణామాలు, దేశంలోని రాజకీయ పరిస్థితులపై పవర్ ఫుల్ వ్యాఖ్యలు చేశారు. సందీప్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, యాదయ్య-పార్వతమ్మ దంపతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ”నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసిన కాలం నుంచి నాకు యాదయ్య సుపరిచితుడు. నా ప్రాణప్రదమైన అభిమాని, నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్త. గతంలో అధికార పార్టీ ఆక్రమణలకు, బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడిన ధీరుడు. గతంలో కూతురిని, ఇప్పుడు కొడుకు సందీప్‌ను కోల్పోవడం ఆ దంపతులకు వర్ణించలేని శోకం. ప్రమాదం జరిగిన మరుక్షణం నుంచే సందీప్‌ను బతికించడానికి శాయశక్తులా ప్రయత్నించాం. కానీ సందీప్ చనిపోవడం నా సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధ కలిగించింది. కేవలం మానవత్వంతోనే పరామర్శించడానికి వచ్చాను.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు.” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అనంతరం మోత్కూరులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల పక్షాన నిలబడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని, విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి తెలంగాణలోని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తాడని స్పష్టం చేశారు. లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను ప్రభుత్వం బలవంతంగా భగ్నం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

మరోవైపు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. గెలిపించిన సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టి వేధించడం సరికాదని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిది, కష్టపడ్డ పాత కార్యకర్తలది ఒకటే పార్టీ అని.. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఏఐసీసీ ఇన్‌ఛార్జ్, పీసీసీ అధ్యక్షులు తీసుకోవాలని కోరారు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, సమన్వయంతో అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>