కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయాన్ని(Bandi Sanjay Office) కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాన్ని నిరసిస్తూ బీజేపీ (BJP Protest) జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ఉనికి కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి కోసం ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా మద్దతు కోల్పోయి అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. నీట్ పరీక్ష అంశంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ ఢిల్లీలో విధ్వంసకర నిరసనలు చేపట్టడం సరికాదని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద నిరసన పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని, చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలను దీటుగా ఎదుర్కొంటామని వారు హెచ్చరించారు.

