కలం, ఖమ్మం బ్యూరో: పంట మార్పిడితోనే వర్షాభావాన్ని జయించి, లాభసాటి వ్యవసాయాన్ని సాధించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు రైతులకు సూచించారు. ఎల్-నినో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, శాస్త్రీయ సాగు (Scientific Farming) వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి దీపక్‌తో కలిసి నిర్వహించిన రైతుల అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నందున, రైతులు నీటి లభ్యతకు తగినట్లుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు. కేవలం బోరు నీటిపై మాత్రమే ఆధారపడి వరి సాగు చేస్తే, నీటి కొరత ఏర్పడి దిగుబడులు ఘోరంగా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల వరికి బదులుగా ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.
ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు సుదీర్ఘకాలం పాటు స్థిరమైన ఆదాయం సమకూరుతుందని, పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని వివరించారు.అంతేకాకుండా, పంటల వైవిధ్యీకరణ ద్వారా నేల సారం పెరగడమే కాకుండా వాతావరణ మార్పుల నుంచి పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో వ్యవసాయ శాఖ అధికారులందరూ రైతులకు అందుబాటులో ఉంటారని, ఎప్పటికప్పుడు అవసరమైన సాంకేతిక సలహాలు, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులు అధికారుల సూచనలు పాటించి, శాస్త్రీయ సాగు పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు.
ఈ అవగాహన సదస్సులో మండల వ్యవసాయ అధికారి దీపక్, వ్యవసాయ విస్తరణ అధికారులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

