కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad ) జిల్లాకు ముసురు పట్టింది. రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఇన్నాళ్ళూ లోటు వర్షపాతంతో వేడెక్కిన భూమి రెండ్రోజుల వర్షాలతో తడిగా మారిపోయింది. వేడి తగ్గిపోయి వాతావరణం మొత్తం చల్లగా మారి తొలిసారి వర్షాకాలం అన్నట్టు తలపిస్తోంది. నిజమాబాద్ నగరంతో పాటు ఆర్మూర్ బోధన్ బాల్కొండ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లోని అనేక మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో పలు రోడ్లు జలమయం అయ్యాయి. శివారు కాలనీలు బురదమయం అయ్యి నడవడానికి కూడా ఇబ్బందిగా మారింది. బురదలో వాహనాల టైర్లు బురదలో కూరుకుపోతున్నాయి. బైకులపై వెళ్ళే వారు సైతం ఇవ్వందులు పడుతున్నారు..
ఎస్సారెస్పీకి వరద ప్రారంభం
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రారంభం అయింది. 3000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 1,091 అడుగులకు గానూ ఇప్పుడు 1064.50 అడుగుల నీటి నిల్వ ఉంది. 80 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం 15.400 టీఎంసీలు ఉంది. గతేడాది ఇదే సమయానికి 1068.60 అడుగులు అంటే 21.029 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. వివిధ రకాలుగా 751 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వెళ్తోంది. కాకతీయ కెనాల్ నుంచి 275 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 25 క్యూసెక్కులు, కోరుట్ల జగిత్యాల మిషన్ భగీరథ అవసరాల కోసం 231 క్యూసెక్కులు, ఆదిలాబాద్ నిర్మల్ అవసరాలకు 63 క్యూసెక్కులు, ఆర్మూర్ నిజామాబాబ్ కామారెడ్డి మిషన్ భగీరథ అవసరాలకు 108 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. జూన్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటివరకూ 2.764 టీఎంసీల వరద ప్రాజెక్టు లోకి వచ్చి చేరింది..
ఆనందంలో అన్నదాతలు
రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి.. ఇన్నాళ్ళూ వర్షాల జాడ లేక నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాల్లో కూడా వ్యవసాయ పనులు ఆలస్యం అయ్యాయి. బోధన్ బాన్సువాడ నియోజక వర్గాల్లో పూర్తి స్థాయిలో నాట్లు పడ్డాయి. మిగతా నియోజక వర్గాల్లో ఇంకా మందకొడిగా సాగుతున్నాయి. నెల రోజులు ఆలస్యంగా నాట్లు వేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. జూలై నెలాఖరు వరకు వర్షాలు లేవనే వాతావరణ అధికారుల సూచనతో పనులు వాయిదా వేస్తూ వచ్చారు. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

