కలం, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం (Kaleshwaram) ఎత్తిపోతల పథకంలోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదివారం సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణీత డెడ్‌లైన్‌లోగా ఈ మూడు బ్యారేజీలను పూర్తిస్థాయిలో ఫంక్షనింగ్‌లోకి తీసుకురావాలని ఆదేశించారు. వచ్చే ఏడాది, 2028 సీజన్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్‌ను కనీసం పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి రిపేర్ పనులు చేయాల్సిన ‘ఆఫ్రే’ కంపెనీ ప్రతినిధులతో పాటు ముంబై ఐఐటీ నిపుణులు కూడా సాజరయ్యారు.
బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్‌లోనే లోపాలు :
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణంలో, ఫౌండేషన్‌లో, డిజైన్‌లోనే లోపాలున్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే గుర్తించాయని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. ఇప్పుడు చేపట్టనున్న రిపేర్ పనులతో బ్యారేజీలను పునరుద్ధరిస్తామన్నారు. డిజైన్ కన్సల్టెంట్‌గా ‘ఆఫ్రీ ఇండియా’ (AFRY India), ముంబై ఐఐటీ (IIT Mumbai)లను జాయింట్ వెంచర్‌గా ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ రెండు సంస్థల ప్రతినిధులు వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, దానిని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ఆమోదానికి పంపి పనులు చేపట్టడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి గుర్తుచేశారు. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) సాయిల్ టెస్ట్ మొదలు జియో ఫిజికల్ పరీక్షలు నిర్వహించాలని, ఈ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఫీల్డు లెవల్‌లో ఒకటిన్నర నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలన్నారు.
హైపవర్ స్టీరింగ్ కమిటీ పర్యవేక్షణ :
కాళేశ్వరం (Kaleshwaram) పథకంలోని ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి జియో టెక్నికల్ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా హైపవర్ స్టీరింగ్ కమిటీని మంత్రి నియమించారు. వారానికి రెండుసార్లు ఈ కమిటీ సమావేశమై మూడు బ్యారేజీల రిపేర్ పనుల ప్రోగ్రెస్‌ను రివ్యూ చేస్తు,ది. అవసరమైనప్పుడు మంత్రి కూడా వర్చువల్‌గా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ మూడు బ్యారేజీలను నిర్మించిన ఎల్ అండ్ టీ (L&T) లాంటి వర్క్ ఏజెన్సీలు వాటి పాత క్యాంపులను, వసతులను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఇసుక తొలగింపు, జియోఫిజికల్ పరీక్షల్లో పూర్తి సహకారం అందించాలన్నారు. ప్రతి పరీక్షను డిజైనర్లు, CWPRS మరియు విభాగపు ఇంజనీర్లు సంయుక్తంగా పర్యవేక్షించి డాక్యుమెంట్ చేయాలని స్పష్టం చేశారు.
Read Also: కన్నీరు పెట్టుకున్న మంగ్లీ.. మైక్రో ఫైనాన్స్ ఆరోపణలపై ఫైర్!
Follow Us On : WhatsApp

