కలం, వరంగల్ బ్యూరో: జనగామ జిల్లాస్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీ వివాదం కలకలం రేపుతున్నది. మొన్నటి వరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య వైరం సాగేది. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో రాజకీయ రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.1400 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారంటూ కాంగ్రెస్ నేతలు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టారు. రూ.1400 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారంటూ ప్రతిపక్షం అడుగుతున్నది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది.
నిధుల పంచాయితీ?
2024-26 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి రోడ్లు, డబుల్ బెడ్రూమ్, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ, గ్రామీణ రోడ్లు కింద సుమారు 1400 కోట్ల రూపాయలతో మంజూరు చేసింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ నిధులు తీసుకొచ్చానని చెప్తున్నారు. రూ.1400 కోట్లలో 60% పనులు గ్రౌండ్‌లో కనిపించడం లేదని.. కేవలం ఫ్లెక్సీలు, శంకుస్థాపన రాళ్లకే పరిమితమయ్యారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో నిధులు ఈ నియోజకవర్గానికి నిధులు రాలేదని.. తాను కేవలం ఒక నెలలోనే నిధులు తీసుకొచ్చానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్లారిటీ ఇస్తున్నారు
ఫ్లెక్సీ రచ్చ
గత మే నెల చివర్లో స్టేషన్ ఘనపూర్ టౌన్ సెంటర్‌తో పాటు పలు చోట్ల కాంగ్రెస్ ముఖ్య నాయకుడు తన ఫోటోతో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. స్టేషన్ ఘనపూర్‌కు రూ. 1400 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చింది తమ నాయకుడు కడియం శ్రీహరి అంటూ ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు రూ.1400 కోట్లు ఎప్పుడు తెచ్చారు? ఎక్కడ ఖర్చు చేశారు? లెక్కలు చూపించాలంటూ కౌంటర్ స్టార్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

