epaper
Wednesday, February 18, 2026
epaper

కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి?

కలం, తెలంగాణ బ్యూరో : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Justice Sudarshan Reddy) రాజ్యసభ (Rajya Sabha) సభ్యులు కానున్నారా? కాంగ్రెస్ (Congress) తరపున ఆయనకు అవకాశం లభిస్తుందా? రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో ఒకటి ఆయనకు ఇచ్చే అవకాశమున్నదా?.. ఇలాంటి చర్చలు కాంగ్రెస్‌లో ప్రాథమిక స్థాయిలో మొదలయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూలు ప్రకారం రాష్ట్రంలో ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనున్నది. ఇందులో ఒకటి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కాగా, మరొకరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేఆర్ సురేష్ రెడ్డి. ఖాళీ అవుతున్న ఈ రెండు స్థానాలకు మార్చి 16న పోలింగ్ జరగనున్నది. వీరిద్దరి పదవీకాలం ఏప్రిల్ 9న ముగుస్తున్నా ఎన్నికల ప్రక్రియను మాత్రం దాదాపు నెల రోజుల ముందే కంప్లీట్ చేసేలా ఈసీ షెడ్యూలు రూపొందించింది.

జస్టిస్ సుదర్శన్‌రెడ్డివైపే కాంగ్రెస్ చూపు :

కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) పోటీ చేశారు. ఓటమి తప్పదని తెలిసినా ఆయన అందుకు సిద్ధపడ్డారు. ఓటమిని నైతిక విజయంగానే ఆయన భావిస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో సైతం తాను వైస్ ప్రెసిడెంట్‌గా ఓడిపోలేదని, నైతికంగా గెలిచానని నొక్కిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రెండేండ్ల క్రితమే చెప్పిన ‘ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యం’ అనే విషయంలోనూ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. రాహుల్‌గాంధీ సైతం పదేపదే ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ స్లోగన్‌ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు అధికారిక కార్యక్రమాల్లోనూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను రాజ్యసభకు పంపాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఏఐసీసీ సైతం మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.

రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే :

రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్‌ది కాగా, మరొకటి బీఆర్ఎస్‌ది. కానీ రాష్ట్రంలో ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం రీత్యా రెండు స్థానాలూ కాంగ్రెస్ గెల్చుకునే అవకాశమున్నది. ఒక్కో రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోడానికి 40 మంది ఎమ్మెల్యేల ఓటింగ్ అవసరం. కాంగ్రెస్ పార్టీకి 65 మంది, పొత్తులో ఉన్న సీపీఐకి ఒకరు చొప్పున ఉన్నారు. కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్న మజ్లిస్ తరపున ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ తరపున ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతుతో రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. రెండో సీటు గెల్చుకోడానికి బీఆర్ఎస్‌కు కూడా తగిన సంఖ్యాబలం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున ఇద్దరు అభ్యర్థులు నిలబడే అవకాశమున్నది. బీఆర్ఎస్‌తో అంటీ ముట్టనట్లుగా ఉన్న పదిమంది ఎమ్మెల్యేల ఓటు కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశమున్నది. ఏ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ‘విప్’ జారీచేసే అవకాశం లేదు.

Read Also: గోడమీది పిల్లి!.. యథేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>