అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు.. నేరాల నియంత్రణ ఎలా?

కలం, జోగులాంబ గద్వాల: నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. కేటిదొడ్డి (KT Doddi) మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజాప్రతినిధులు, దాతలు, వ్యాపారులు, గ్రామస్థుల సహకారంతో మొత్తం 54 కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం కొన్ని మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. మిగిలిన కెమెరాలు మూలకు చేరడంతో నిఘా వ్యవస్థ బలహీనపడింది.

ముఖ్యంగా మైలగడ్డ స్టేజ్, నందిన్నె గ్రామాలలో వరుస చోరీలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కెమెరాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. ఇర్కిచేడు, పాగుంట, వెంకటాపురం, పాతపాలెం, కుచినెర్ల, చింతలకుంట, నందిన్నె తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. లక్షల రూపాయల ప్రజాధనం, దాతల సహకారం వృథా అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిఘా లేక.. చోరీలకు అడ్డుకట్టేదీ?

దొంగతనాలు, వాహనాల అపహరణలు, దాడులు, రోడ్డు ప్రమాదాల సమయంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మండలంలో ఎక్కువ శాతం కెమెరాలు పనిచేయకపోవడంతో నేరాల ఛేదనలో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనిచేస్తున్న కొన్ని కెమెరాల్లోనూ నాణ్యత లోపించడంతో చీకటి, వర్షం సమయంలో స్పష్టమైన దృశ్యాలు రికార్డు కావడం లేదని తెలుస్తోంది.

చెక్‌పోస్టులోనూ చీకటే!తెలంగాణ–కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దులోని నందిన్నె చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం కొంతకాలంగా పనిచేయడం లేదు. అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే కీలక ప్రాంతంలోనే నిఘా నేత్రాలు మూగబోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానిత వాహనాలు, వ్యక్తుల కదలికలను గుర్తించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

నిర్వహణ బాధ్యత ఎవరిది?

గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కెమెరాల నిర్వహణకు ప్రత్యేక నిధులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. మరమ్మతుల బాధ్యత ఎవరు తీసుకోవాలనే స్పష్టత లేకపోవడంతో పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. పోలీసు అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి కెమెరాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

సమస్యను పరిష్కరిస్తాం: పి. శ్రీనివాసులు, ఎస్సై, కేటిదొడ్డి

సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనిచేయని కెమెరాలను గుర్తించి, వాటికి మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>