సత్తుపల్లిలో ‘చేయూత’ వెలుగులు.. 1,252 కొత్త పింఛన్లు పంపిణీ!

​కలం, ఖమ్మం బ్యూరో: గత పదేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న సత్తుపల్లి (Sathupalli) పేదల నిరీక్షణకు ప్రజా ప్రభుత్వం తెరదించింది. సత్తుపల్లి మునిసిపల్ పరిధిలోని 1,252 మంది అర్హులకు మంజూరైన కొత్త ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) మంగళవారం స్థానిక లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్‌లో పంపిణీ చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లతో కలిసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచే మహిళలకు మరో శుభవార్త చెబుతూ, గతంలో పాలపిట్ట రంగు చీరలు అందించామని, రాబోయే నవంబర్ 19న ఆడబిడ్డలకు చిలకపచ్చ చీరలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కీలక ప్రకటన చేశారు.

​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. సత్తుపల్లి మునిసిపాలిటీలో మంజూరైన 1,252 కొత్త పింఛన్ల ద్వారా ప్రతి నెలా రూ. 2.18 కోట్ల లబ్ధి చేకూరుతుందని, పింఛనుదారు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్‌గా పింఛను వర్తింపజేసే నూతన విధానాన్ని తెచ్చామని వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీతో పాటు డ్వాక్రా మహిళలకు రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించామన్నారు. రూ. 40 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని తెలిపారు.

​కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం మిగిల్చినప్పటికీ, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత బస్సు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, ఎటువంటి పరిమితులు లేకుండా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేశామని, దివ్యాంగులకు నెలకు రూ. 4,016, ఇతరులకు రూ. 2,016 అందజేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ, పదేళ్ల పేదల కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ. 5 లక్షలు జమ చేస్తున్నామని, వరద బాధిత డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇంచార్జి డీఆర్డీవో శిరీష, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా బేగం, ఏఎంసీ చైర్మన్ చల్లగుల్ల నరసింహారావు, కమిషనర్ నర్సింహా, తహసీల్దార్ రవికుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>