కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం ఉపాధి ఆటో, క్యాబ్ ఓనర్ డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ‘ ఆటో డ్రైవర్ సేవలో’ (వాహన మిత్ర) (Auto Driver Sevalo) పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం అర్హులైన డ్రైవర్లకు ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన నిధులను మంగళవారం రూ.231 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాహనాల బీమా (ఇన్సూరెన్స్), ఫిట్నెస్ సర్టిఫికెట్లు, మరమ్మతులు వంటి వార్షిక ఖర్చుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిధులను మంజూరు చేసింది. సొంతంగా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి, స్వయంగా వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్లకు త్వరలోనే ఈ ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు ఈ పథకం వర్తించదు. అర్హులైన లబ్ధిదారులు తమ సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలు లేదా అధికారిక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తు, పేమెంట్ స్టేటస్‌ను పరిశీలించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

