కలం, తెలంగాణ బ్యూరో: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని (Indiramma Insurance Scheme) లాంఛనంగా ప్రారంభించనున్నది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సిద్దిపేట్ వేదికగా లబ్ధిదారులకు నమూనా చెక్కులు ఇవ్వడం ద్వారా ఈ స్కీమ్ ప్రారంభం కానున్నది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఈ బీమా కల్పించడం ద్వారా దేశంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందంటూ డిప్యూటీ సీఎం మూడు రోజుల కింద పేర్కొన్నారు. కుల, మత, ఆదాయం తేడా లేకుండా ప్రతీ కుటుంబానికి లబ్ది కలుగుతుందన్నారు.
కానీ, ఈ స్కీమ్‌కు అర్హతలను నిర్ణయించే గైడ్‌లైన్స్ ఇంకా విడుదల కాకపోవడంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొన్నది. గరిష్ట వయో, ఆదాయ పరిమితిపై స్పష్టత లేకపోవడం ఇందుకు కారణం. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు.. వీరికి కూడా వర్తిస్తుందా? వైట్ రేషన్ కార్డులేనివారికి వర్తిస్తుందా? లాంటి సందేహాలకు ప్రభుత్వం విడుదల చేయనున్న గైడ్‌లైన్స్ ద్వారా స్పష్టత రానున్నది.
అర్హతలపై ప్రజల్లో గందరగోళం
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్ (Indiramma Insurance Scheme) ద్వారా రాష్ట్రంలోని కుటుంబాలన్నింటికీ లబ్ధి కలుగుతుందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. కానీ అర్హతలను నిర్ధారించే నిబంధనల్లో ప్రభుత్వం ఎలాంటి షరతులు విధిస్తుందనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారినే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిగా ప్రభుత్వం గుర్తిస్తున్నందున ఆ కుటుంబాలకు మాత్రమే పరిమితం చేస్తుందనే మాటలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఆదాయంతో సంబంధం లేదు: భట్టి
గతంలో రాష్ట్రంలో అమలైన కొన్ని బీమా పథకాలు నిర్దిష్ట శాఖలు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయి. కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రతీ కుటుంబానికి జీవిత బీమా కల్పించాలని రేవంత్ నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించింది. కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా వర్తిస్తుందని 3 రోజుల కింద డిప్యూటీ సీఎం భట్టి వివరణ ఇచ్చారు.
ఇన్సూరెన్స్ కంపెనీలతో టెక్నికల్ చిక్కులు
గత ప్రభుత్వం ‘రైతుబీమా’ పేరుతో రాష్ట్రంలోని రైతులకు లబ్ధి చేకూర్చేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నది. కనీస వయసును 18 ఏండ్లు, గరిష్ట వయోపరిమితిని 59 ఏండ్లుగా ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్ణయించాయి. రైతుల వయసు 59 సంవత్సరాలు దాటితే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే అవకాశం లేకుండా పోయింది. వారిని కూడా ఈ కవరేజ్‌లోకి తీసుకురావాలనుకుంటే ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందన్నాయి.
ఇప్పుడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విషయంలోనూ అలాంటి టెక్నికల్ చిక్కులు వచ్చే అవకాశమున్నది. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసే గైడ్‌లైన్స్ ద్వారా స్పష్టత రానున్నది. కుటుంబంలో ఆదాయాన్ని ఆర్జించే పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతో దీన్ని రూపొందిస్తున్నందున గరిష్ట ఆదాయం విషయంలో ఎలాంటి పరిమితులు ఉంటాయన్న సందేహం కూడా నెలకొన్నది. ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ దగ్గర సిద్ధంగా ఉన్న డ్రాఫ్ట్ కాపీను ఫైనల్ చేసిన తర్వాత సందేహాలకు సమాధానం లభించనున్నది.
నేటి నుంచి గ్రామాల్లో ‘టామ్ టామ్’ ప్రచారం
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్నందున బడ్జెట్లో పేర్కొన్నట్లుగానే లాంఛనంగా నవంబర్ 19న సిద్దిపేట్ వేదికగా అమల్లోకి రానున్నది. ఇందుకోసం నవంబర్ 19 నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపట్టాలని డిప్యూటీ సీఎం ఈ నెల 13న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. నమోదు ప్రక్రియ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ నెల 17, 18వ తేదీల్లో ప్రతీ గ్రామంలో ‘టామ్ టామ్’ ద్వారా ప్రచారం చేయించాలన్నారు.
నమోదు కేంద్రాలపై సమాచారం ఇవ్వాలి
నమోదు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయాలని అధికారులకు భట్టి ఇప్పటికే సూచించారు. కుటుంబంలో ఒకరు ఉపాధి ద్వారా ఆదాయాన్ని ఆర్జించే పెద్దగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికే బీమా వర్తించనున్నది. పలువురు ఉపాధి పొందుతూ సంపాదించేవారుగా ఉంటే ఎవరికి బీమా కల్పించాలనేది ఆ కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బీమా సౌకర్యం పొందేటప్పుడు ఒకరిని లేదా పలువురిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బీమా మొత్తంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే రూ. 5 లక్షల్లో ఏ నామినీకి ఎంత అనే అంశాన్ని కూడా ఆ కుటుంబ సభ్యులే నిర్ణయించాల్సి ఉంటుంది.

