కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సుమారు 60 సంవత్సరాల అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించనున్న చారిత్రాత్మక శ్రీ స్వామివారి చందనోత్సవ (Chandanotsavam) మహోత్సవానికి రాష్ట్ర ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను దేవస్థాన ప్రతినిధులు వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను స్థానిక శాసనసభ్యులు డా. మేడిపల్లి సత్యం, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. అంజనా రెడ్డి, పర్యవేక్షకులు సునీల్ కుమార్, వేదపారాయణదారులు, అర్చకులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా చందనోత్సవ మహోత్సవానికి హాజరై స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అదేవిధంగా దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత అరుదైన రీతిలో నిర్వహించనున్న ఈ విశిష్ట ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొని, శ్రీ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సైతం దేవస్థాన ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

