కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అనేక హామీలను ఇంతవరకు అమలు చేయలేదన్నారు. తెలంగాణ మళ్లీ గాడిన పడాలంటే.. కేసీఆర్ పాలన రావాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకే, బీఆర్ఎస్ పార్టీలో చేరాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పిన ఆయన.. తనను ఆహ్వానించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బోర్నపల్లి వంతెన కోసం నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తనను మానసికంగా ఇబ్బంది పెట్టాడని మండిపడ్డారు. జగిత్యాలకు కేసీఆర్ వస్తున్నాడని తెలిసి.. రేవంత్ రెడ్డి ఇప్పుడు నిద్ర లేచాడని విమర్శించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో పేలుడు జరిగితే.. ఇంతవరకు శవాలు కూడా బయటకు తీయలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కూలిపోయినందుకు.. మరమ్మతులు చేయకుండా టైంపాస్ చేస్తున్నారని ఆరోపించారు. పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా చేయడం కేవలం కేసీఆర్ తోనే సాధ్యమైందన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారని ప్రశంసలు గుప్పించారు. రైతులకు సకాలంలో రైతుబంధు, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణం చేసి.. అన్ని జిల్లాలను సస్యశ్యామలం చేశారని జీవన్ రెడ్డి (Jeevan Reddy) వివరించారు.
Read Also: తోడేలు గుండెలు అదరాలి.. కేసీఆర్ పై సీఎం రేవంత్ కామెంట్స్
Follow Us On : WhatsApp

