కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) కలిసి భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. జీవన్ రెడ్డిని పుష్పగుచ్ఛాలతో కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. తన నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డిని కేసీఆర్ (KCR) అప్యాయంగా దగ్గరికి తీసుకొని, హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. దుశ్శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కేసీఆర్‌తో భేటీ సందర్భంగా జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.
కేసీఆర్‌తో (KCR) మాట్లాడుతూ.. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకే మీతో కలిసి పనిచేయమని దేవుడే తనను మీ దగ్గరికి పంపించాడని జీవన్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘అన్నా చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా’ అంటూ తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆతిథ్యానికి కేసీఆర్ ఆహ్వానించారు. సుదీర్ఘ ప్రస్థానం కలిగిన జీవన్ రెడ్డి (Jeevan Reddy), కెసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. దశాబ్దాల పాటుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జగిత్యాల సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
జీవన్ రెడ్డితోపాటు వచ్చిన వారిలో వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులున్నారు. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరురులు కేసీఆర్ నివాసంలో ఉన్నారు.
Read Also: రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ క్లోజ్: డీజీపీ
Follow Us On: Instagram

