కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మావోయిస్టు పార్టీ పూర్తి క్లోజ్ అయిందని, ఆ పార్టీకి మ్యాజిక్ వెపన్‌గా ఉన్న పీఎల్జీఏ (PLGA) కూడా కనుమరుగైందని డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. మావోయిస్టు పార్టీ సాయుధ దళాల నుంచి తెలంగాణ రాష్ట్ర సంపూర్ణంగా విముక్తి అయిందన్నారు. ఆ పార్టీకి చెందిన 42 మంది ప్రభుత్వానికి 36 ఆయుధాలు, వెయ్యికి పైగా తూటాలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, 800 గ్రాముల బంగారంతో సహా శుక్రవారం లొంగిపోయిన (Maoist Surrender) సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. లొంగిపొయినవారిలో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ మల్లా సోడి, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు చాప నారాయణ కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో లీడర్లు ఇక ఎవరూ లేరని, పీఎల్జీఏ కూడా పూర్తిగా డీయాక్టివేట్ అయినట్లేనని అన్నారు. దీంతో ఆపరేషన్ కగార్ తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య 761 అని తెలిపారు.
లొంగిపోయినవారిలో మొత్తం నలుగురు కేంద్రకమిటీ సభ్యులు, 21 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 40 మది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. తెలంగాణకు చెందిన లీడర్లు మావోయిస్టు పార్టీలో కేవలం ఐదుగురే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, ఇందులో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు (గణపతి, పసునూరి నరహరి), ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు (సుజాత – గణపతి భార్య), వార్త శేఖర్), ఏరియా కమిటీ సభ్యురాలు భాగ్య అని వివరించారు. మొత్తం 302 ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించారని, ఇందులో ఐదు ఎల్ఎంజీలు, 54 ఏకే-47 ఆటోమేటిక్ రైఫిళ్లు, 46 ఇన్సాస్, 47 ఎస్ఎల్ఆర్ సెమీఆటోమేటిక్ రైఫిళ్లు ఉన్నాయన్నారు. ఆపరేషన్ కగార్ కంటే ముందు మావోయిస్టు పార్టీలో తెలగాణకు చెందినవారు 11 మంది ఉంటే ఇప్పుడు ఇద్దరే ఉన్నారని, 24 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుంటే కేవలం ఇద్దరే అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారని తెలిపారు.

Read Also: కేసీఆర్‌ను కలిసి భావోద్వేగానికి గురైన జీవన్ రెడ్డి
Follow Us On : WhatsApp

