కలం, వెబ్ డెస్క్: గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని.. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) వ్యాఖ్యానించారు. ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని.. 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని అన్నారు. గురువారం ములుగు లీలా గార్డెన్ లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఇటీవల ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పాలన, చట్టాలు, విధివిధానాలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ స్థిరమైన యాక్షన్ ప్లాన్ అమలుపై సమగ్ర అవగాహన కల్పించేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ చట్టాలు, తమ అధికారాలు, బాధ్యతలు, విధులు విధానాలపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు.
కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా పనులు చేపట్టాలి..
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా గ్రామాభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. గ్రామసభలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని అన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులు అమల్లోకి వస్తున్న తరుణంలో ప్రతి సర్పంచ్ నిధుల మార్గదర్శకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు. గతంలో అవగాహన లోపంతో కొందరు సర్పంచులు నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
గ్రామాభివృద్ధిలో సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు చేరువవుతాయని మంత్రి సూచించారు. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, స్వచ్ భారత్ మిషన్ డైరెక్టర్ ములుగు జిల్లా ప్రత్యేక అధికారి సురేష్ బాబు సర్పంచులకు శిక్షణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

