ఇజ్రాయెల్(Israel), హమాస్(Hamas) మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. గాజా(Gaza) ప్రజలకు అంతర్జాతీయ సమాజం పంపుతున్న మానవతా సాయాన్ని హమాస్ అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది. దక్షిణ గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించిన సహాయ ట్రక్కును హమాస్ కార్యకర్తలు ఆపి, డ్రైవర్‌పై దాడి చేసి సాయాన్ని దోచుకున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
హమాస్(Hamas) చర్యలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆకలితో అలమటిస్తున్న గాజా ప్రజలకు చేరాల్సిన సహాయాన్ని అడ్డుకోవడం హమాస్ అమానుషత్వం. ప్రజల ప్రాణాలతో ఆ సంస్థ చెలగాటమాడుతోంది” అని విమర్శించారు. గాజాలో శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇలాంటి ఘటనలు దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 దేశాలు, అనేక అంతర్జాతీయ సంస్థలు గాజా ప్రజలకు మానవతా సహాయం అందిస్తున్నాయని తెలిపారు.
అమెరికా ఆధ్వర్యంలో శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే దానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమాధానం ఇచ్చారు. “దక్షిణ గాజాలో మా దళాలపై హమాస్ కాల్పులు జరిపింది. దాంతోనే ప్రతిదాడి జరిపాం” అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కింద హమాస్ బందీల మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగిస్తోందని ఆయన తెలిపారు.
Read Also: ప్రశాంత్ కిశోర్ అనుచరుడి హత్య.. జేడీయూ నేత అరెస్ట్
Follow Us On : Instagram

