కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా కలెక్టర్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మిక, కర్షక, లారీ, ట్రాక్టర్, భవన నిర్మాణ కాంట్రాక్టర్ల సంఘాల ప్రతినిధులు, మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వనితా టీ స్టాల్ నిర్వహిస్తున్న దళిత మహిళ పలమకుల మంజుల మాట్లాడుతూ.. గత కలెక్టర్ తనకు మంజూరు చేసిన టీ స్టాల్‌ను ప్రస్తుత కలెక్టర్ వాస్తు పేరుతో ఎటువంటి కనికరం లేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేడుకున్నా, కాళ్లు మొక్కినా కూడా తన జీవనాధారాన్ని కాపాడలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంలో మహిళా కౌన్సిలర్లు కౌన్సిల్‌లో చర్చకు తీసుకురావాలని కోరినా మున్సిపల్ చైర్మన్ స్పందించలేదని ఆమె తెలిపారు. మాజీ కౌన్సిలర్ కత్తుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ నుంచి రావాల్సిన రూ.17 లక్షల బకాయిల విషయంలో జిల్లా కోర్టు జప్తు ఆదేశాలు ఇచ్చినప్పుడు కలెక్టర్ జోక్యం చేసుకుని కోర్టు సిబ్బందిని అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉందన్నారు. వ్యక్తిగత కక్షతో తన వ్యాపారంపై ఎనిమిది శాఖలతో విచారణలు చేయిస్తున్నారని వాపోయారు.
ట్రాక్టర్ యజమానుల సంఘం జిల్లా నాయకుడు ఆకుల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఇసుక రవాణాపై కఠిన నిబంధనలు పెట్టి లక్షల రూపాయల జరిమానాలు విధించడం వల్ల ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. మట్టి రవాణాపైనా ఆంక్షలు విధించడం వల్ల భవన నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోతే భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఏకమై కలెక్టర్ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. విజయ డైరీ పార్లర్ నిర్వాహకురాలు విజయలక్ష్మి కూడా తన స్టాల్‌ను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో ట్రాన్స్‌పోర్ట్ సంఘం నాయకుడు గొంగళ్ల రామకృష్ణ మాట్లాడుతూ, ఇసుక రవాణాపై ఆంక్షల కారణంగా వందలాది మంది ఆటో ట్రాలీ కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. న్యాయవాది రాగళ్ల శ్రీహరి మాట్లాడుతూ, కలెక్టరేట్‌కు వచ్చే న్యాయవాదుల వాహనాలను దూరంలో నిలిపివేయడం వల్ల మండుటెండలో నడిచి రావాల్సి వస్తోందని, ఇది అవమానకరమని అన్నారు. పత్రికా ప్రతినిధుల సంఘం జిల్లా నాయకుడు పారనంది వెంకటస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులను కూడా కలెక్టర్ అవమానపరుస్తున్నారని ఆరోపించారు. 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కలెక్టర్‌ను కలవడానికి వెళ్లినా తనను కలవకుండా తిరస్కరించారని తెలిపారు. ప్రజాప్రతినిధులను అవమానించడం సరికాదన్నారు.
సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, టీఆర్‌పీ పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, జేఎంఐ రాష్ట్ర కన్వీనర్ కన్నారపు పరశురాములు, టీఆర్‌ఎస్ (కవిత) పార్టీ నాయకులు అనంతుల ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ తన వైఖరిని 20 రోజుల్లో మార్చుకోకపోతే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్, అంబేద్కర్ సంఘం నాయకులు మల్లిగారి రాజు, అవాజ్ జిల్లా కార్యదర్శి ఎండీ అజహర్, రజక సంఘం నాయకులు కొలిపాక నర్సింహులు, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ బూడిద గోపి, సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పజ్జూరి జయహరి, తదితరులు పాల్గొన్నారు.

