కలం, వెబ్ డెస్క్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరి (Pudi Srihari) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సుప్రీంకోర్టులో సైతం ఊరట లభించకపోవడంతో ఆయనను కుప్పం పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదం గత కొన్ని రోజులుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. ఈ నెల 15న విజయవాడలో శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా 16న కుప్పం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించింది.
అయితే కుప్పం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పోలీసులు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు దిగువ కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ పోలీసుల వాదనతో ఏకీభవించింది. దీనిపై శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు ఉత్తర్వులను దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైంది. తాజాగా బెంగళూరులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడుతున్నారు.

