కలం, వెబ్‌డెస్క్: జుట్టు రాలడం (Hair Loss).. 90శాతం మంది ప్రజలను వేధిస్తున్న విషయం. పెద్దోళ్లే కాదు యువకుల్లో కూడా ఈ సమస్య అధికంగానే ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎన్నెన్నో మార్గాలను అవలంబిస్తుంటారు. ఇందులో ఇటీవల కాలంలో రోజ్‌మెరీ ఆయిల్ (Rosemary Oil), మైక్రోనెడ్లింగ్ (Microneedling) అనేవి విరివిగా వినిపిస్తున్న పరిష్కారాలు. తల దువ్వుకున్నప్పుడు లేదా నిద్రలేచినప్పుడు దిండుపై రాలిన వెంట్రుకలను చూసి కంగారు పడని వారుండరు. దీనికోసం వేల రూపాయల ఖర్చుతో కూడిన చికిత్సల నుండి ఇంటి చిట్కాల వరకు అన్నీ వెతుకుతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ‘రోజ్‌మెరీ ఆయిల్’, ‘మైక్రోనెడ్లింగ్’ అనేవి నిజంగా జుట్టు రాలడాన్ని అరికడతాయా? దీనిపై ఉన్న వాస్తవాలేంటో తెలుసుకుందాం.
జుట్టు రాలడానికి కారణాలు:
సాధారణంగా ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత వల్ల జుట్టు రాలుతుంటుంది. జుట్టు రాలడం ఇప్పుడిప్పుడే మొదలైతే దానిని అరికట్టి, తిరిగి వచ్చేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మైక్రోనీడ్లింగ్ అంటే ఏమిటి?
ఇది వినడానికి కాస్త భయంగా అనిపించినా చాలా సరళమైన ప్రక్రియ. డెర్మా రోలర్ అనే చిన్న పరికరాన్ని తల చర్మంపై ఉపయోగించడం ద్వారా చిన్న గాయాలు చేస్తారు. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి, జుట్టు కుదుళ్లు చురుగ్గా మారుతాయి. మైక్రోనెడ్లింగ్ వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుందని పలు పరిశోధనలు కూడా ధృవీకరించాయి.
రోజ్‌మెరీ ఆయిల్ ప్రత్యేకత
రోజ్‌మెరీ ఆయిల్ రక్త ప్రసరణను పెంచడంతో పాటు వాపును తగ్గిస్తుంది. 2015లో జరిగిన ఒక అధ్యయనంలో, ఆరు నెలల పాటు ఈ నూనెను వాడిన వారిలో సాధారణ జుట్టు చికిత్సల (మినాక్సిడిల్) స్థాయిలోనే ఫలితాలు కనిపించాయి. ఇది జుట్టు సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడం వలన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మైక్రోనెడ్లింగ్ ద్వారా తల చర్మాన్ని సిద్ధం చేసి, ఆపై రోజ్‌మేరీ ఆయిల్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది పొలానికి ఎరువులు వేసే ముందు భూమిని దున్నడం వంటిదని నిపుణులు చెప్తున్నారు.
రోజ్‌మెరీ ఆయిల్ ఉపయోగించే విధానం..
అయితే మైక్రోనెడ్లింగ్ వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చేయాలని, అతిగా చేస్తే చర్మం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజ్‌మెరీ ఆయిల్ నేరుగా వాడకుండా కొబ్బరినూనె లేదా క్యాస్టర్ ఆయిల్ (ఆముదం నూనె) వంటి నూనెలతో కలిపి వారానికి 2 నుండి 4 సార్లు వాడాలని సూచిస్తున్నారు. ఫలితాలు వెంటనే రావాలని ఆశించవద్దు. సాధారణంగా 4 నుండి 6 వారాల్లో జుట్టు రాలడం తగ్గుతుంది, 6 నెలల తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. దీనితో పాటు ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మాత్రం తప్పకుండా చర్మ నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

