హుజూర్ నగర్‌పై జగదీశ్ ఫోకస్.. అసలు వ్యూహం అదేనా!

కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా సరిహద్దు నియోజకవర్గమైన హుజూర్‌నగర్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిపై స్థానికంగా జోరుగా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం హుజూర్నగర్ లో బీఆర్ఎస్ కు సరైన నాయకుడు లేడు. అయితే.. ఇక్కడ కొత్త ఇన్‌చార్జి నియామకం ఆలస్యం కావడం వెనుక జగదీశ్ రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతున్నది. నమ్మకస్తుడైన వ్యక్తికి కోఆర్డినేటర్ బాధ్యతలు ఆయనే అప్పగించినట్లు లోకల్ లీడర్లు మాట్లాడుకుంటున్నారు.

గెలిచిన చోటే.. గడ్డు పరిస్థితి

2014, 2018 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘కారు’ దూసుకెళ్లింది. హుజూర్ నగర్లో మాత్రం కాంగ్రెస్ దిగ్గజ నేత ఉత్తమ్ పట్టును నిలబెట్టుకుంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మను బీఆర్ఎస్ బరిలోకి దించింది. ఇక్కడ పార్టీ తన ప్రాబల్యాన్ని చాటుకున్నప్పటికీ విజయం సాధించలేకపోయింది. 2019లో ఉత్తమ్ ఎంపీగా గెలిచి రాజీనామా చేయడంతో వచ్చిన బై పోల్ లో గులాబీ అధిష్టానం.. కెనడా నుంచి వచ్చిన శానంపూడి సైదిరెడ్డికి టికెట్ ఇచ్చింది.

క్షేత్రస్థాయి శ్రేణుల కష్టం, పార్టీ ముఖ్య నేతల వ్యూహాత్మక ప్రచారంతో సైదిరెడ్డి కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టి విజయం సాధించారు. అనూహ్య విజయం సాధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే సైదిరెడ్డి వైఖరి పార్టీలో తీవ్ర అంతర్గత విభేదాలకు దారితీసింది. నియోజకవర్గంలో పార్టీని నమ్ముకున్న ఉద్యమకారులను, సీనియర్ నేతలను పక్కనబెట్టి, కేవలం తన సొంత వర్గానికి పెద్దపీట వేశారనే విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది.

మాజీ మంత్రి వ్యూహమేంటి?

2009లో హుజూర్ నగర్ నుంచి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) పోటీ చేశారు. శంకరమ్మ టికెట్ నుంచి సైదిరెడ్డి రాజకీయాల వరకు ఆయన ప్రమేయమే ఉందనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ రెడ్డి.. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన లేదా రిజర్వేషన్ల మార్పు జరిగితే హుజూర్ నగర్ లేదా తుంగతుర్తి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన హుజూర్ నగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.

ఇక్కడ తన నమ్మకస్తుడైన ఒంటెద్దు నరసింహారెడ్డిని కో ఆర్డినేటర్‌గా నియమించి పరోక్షంగా చక్రం తిప్పుతున్నారని బీఆర్ఎస్ కేడర్ భావిస్తున్నది. మొత్తానికి హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ నాయకత్వలేమితో బలహీనపడుతున్నది. అంతర్గత రాజకీయాలు, మాజీ మంత్రి వ్యూహాలు పక్కనబెట్టి.. అధిష్టానం సమర్థుడైన నేతను ఇన్‌చార్జిగా నియమిస్తేనే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ధైర్యం వచ్చి పార్టీ మళ్లీ పుంజుకునే చాన్స్ ఉంది.

పోరు తట్టుకోలేకే బీజేపీలోకి శానంపూడి!

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన కొన్నినెలలకే హుజూర్ నగర్ నేత శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి వెళ్లారు. నమ్మిన నేత మధ్యలోనే హ్యాండ్ ఇవ్వడంతో స్థానిక గులాబీ కేడర్ తీవ్ర అసంతృప్తికి లోనైంది. సైదిరెడ్డి వెంట కొందరు వెళ్లగా, మరికొందరు స్థానిక సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరారు.

దీంతో నియోజకవర్గంలో సగానికిపైగా గులాబీ శ్రేణులు ఇతర పార్టీల్లో వలస వెళ్లిపోయారు. ఇప్పుడు హుజూర్ నగర్లో బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం తెచ్చేలా పరిస్థితి ఉంది. సైదిరెడ్డి వెళ్లిపోయిన నాటి అధిష్టానం కొత్త ఇన్‌చార్జిని నియమించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సరైన నాయకత్వం లేకపోవడంతో నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసేవారే లేరు.

మరోవైపు రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పార్టీని నమ్ముకున్న నిజమైన ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడం, ఆర్థిక బలం ఉన్నవారికే అధిష్టానం పెద్దపీట వేస్తుందనే ఆవేదన క్షేత్రస్థాయి శ్రేణుల్లో నిరాశను నింపింది. దీనికితోడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఏ చిన్న ఆపద వచ్చినా పరామర్శించేందుకు, అండగా నిలబడేందుకు కనీసం ఒక్క నేత కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర వేదనకు గురిచేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>