సన్నబియ్యం అక్రమాలపై కొరడా.. 34 మిల్లుల సేకరణ బంద్‌!

కలం, ​కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ రైస్ మిల్లర్లు (Karimnagar Rice Millers), అక్రమార్కులు పన్నిన దొడ్డిదారిన దోపిడీ వ్యూహానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం గట్టి చెక్ పెట్టిందని రైస్ మిల్లర్ కాచం శ్రీనివాస్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను గ్రహించిన ప్రజా ప్రభుత్వం తక్షణమే స్పందించి, పౌరసరఫరాల శాఖ ద్వారా కఠిన చర్యలకు ఉపక్రమించిందని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి పడకుండా ముందస్తుగా అడ్డుకట్ట వేశారని పేర్కొన్నారు.

​అసలేం జరిగింది?

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి సేకరించిన ‘గ్రేడ్-ఎ’ (సన్న రకం) వడ్లను ‘కామన్’ (దొడ్డు రకం) గా మార్చేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్రవంతి మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిందని శ్రీనివాస్ వివరించారు. గ్రేడ్-ఎ వడ్లను కామన్ రకంగా మార్చడం వల్ల వచ్చే ధరల వ్యత్యాసాన్ని (క్వింటాలుకు ₹34.21 చొప్పున) రైస్ మిల్లర్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

​అయితే, ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని పలువురు మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యాన్ని అప్పగించేందుకు, ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.

​కరీంనగర్ కలెక్టర్ సంచలన ఆదేశాలు

ఈ వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలను తక్షణమే అరికట్టేందుకు కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల విభాగం తీవ్ర స్థాయిలో స్పందించినట్లు కాచం శ్రీనివాస్ పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు పంపిన అధికారిక లేఖ ద్వారా కఠిన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

​34 రైస్ మిల్లులపై చర్యలు

జమ్మికుంట, కొత్తపల్లి, హుజూరాబాద్, మానకొండూర్, కేశవాపట్నం, ఇల్లంతకుంట, గోడిశాల, రేణికుంట తదితర ప్రాంతాల్లోని 34 ప్రధాన రైస్ మిల్లులకు సంబంధించి సన్నబియ్యం సేకరణ ,డెలివరీలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ​

లక్ష క్వింటాళ్లకు పైగా ధాన్యం లెక్కింపు

నిలిపివేసిన మిల్లుల జాబితాలో మొత్తం 1,08,904.40 క్వింటాళ్ల ధాన్యం ఉంది. తదుపరి ఉత్తర్వుల వరకు నిషేధం. పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుండి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సదరు రైస్ మిల్లుల నుండి ఎలాంటి సన్నబియ్యం కన్సైన్మెంట్లను స్వీకరించవద్దని ఎఫ్‌సిఐని స్పష్టంగా ఆదేశించారు.

​అక్రమార్కులకు హెచ్చరిక

ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల మేర నష్టం కలిగించేలా ప్రవర్తించే మిల్లర్లు, వ్యాపారులపై ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రతిని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి కూడా పంపి హెచ్చరించారని, ప్రజా ధనాన్ని కాపాడేందుకు, బియ్యం సరఫరాలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోందని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>