కలం డెస్క్ :
తెలంగాణలో ఒక సీనియర్ మంత్రి ఆస్తులపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నిర్దిష్ట సమాచారంతోనే ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. అత్యంత పకడ్బందీగా జరిగిన ఈ సోదాల విషయం ఇప్పటివరకూ వెలుగులోకి రాలేదు. వారం రోజులు దాటినా గోప్యంగానే ఉండిపోయింది. అటు మంత్రికి సన్నిహితంగా ఉన్నవారి నుంచీ సమాచారం బైటకు పొక్కలేదు. ఇటు ఐటీ అధికారులు సైతం ఎలాంటి ప్రకటనా చేయలేదు. సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సదరు మంత్రి, ముఖ్యమంత్రి మధ్య జరిగిన సంభాషణల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ విషయమై చర్చించి ఐటీ శాఖ తరఫున ఎలాంటి కేసు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. మంత్రులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పనిచేసుకోవాలని పలుమార్లు వారికి సున్నితంగానే హెచ్చరిక చేశారు. అయినా కొందరి విషయంలో అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఐటీ దాడులే జరిగాయి. ఆ మంత్రి విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తన వంతు ప్రయత్నం చేస్తారా?.. లేక ఈ విషయం ఏఐసీసీ స్థాయికి కూడా వెళ్తే అగ్ర నాయకత్వం మౌనంగా ఉంటుందా?.. రానున్న రోజుల్లో ఆ మంత్రికి ఊహించని చిక్కులు ఎదురవుతాయా?.. ఇవన్నీ తేలాల్సి ఉన్నది.

