కలం, వెబ్డెస్క్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) క్లబ్స్ (ISL) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ లీగ్ ఫిబ్రవరి 14 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పుడు ఐఎస్‌ఎల్ క్లబ్బుల ఆర్థిక సంక్షోభం వల్ల ఆటగాళ్ల భవిష్యత్తు గందరగోళంగా మారింది. లీగ్ నిర్వహణ ఖర్చు పూర్తిగా క్లబ్బుల భుజాలపై పడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రసార ఒప్పందం లేకపోవడం, పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడం కారణంగా చాలా జట్లు జీతాల పునఃసమీక్ష దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎఫ్‌సీ గోవా నుంచి బెంగళూరు ఎఫ్‌సీ వరకు అనేక క్లబ్బులు ఆటగాళ్లతో చర్చలు మొదలుపెట్టాయి. బెంగళూరు ఎఫ్‌సీ యజమాని పార్థ్ జిందాల్ జీతాల్లో కోతకు సహకరించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేయగా.. 20 నుంచి 25 శాతం వరకు తగ్గింపు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. క్లబ్బులు భారీ త్యాగాలు చేస్తున్న వేళ ఆటగాళ్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.
మరోవైపు కొత్తగా ప్రమోట్ అయిన ఇంటర్ కాశీ క్లబ్ పూర్తి ఉత్సాహంతో ఐఎస్‌ఎల్(ISL)లోకి దిగేందుకు సిద్ధమైంది. జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కూడా పాల్గొనడం ఖాయం చేసింది. ఇప్పటికే 13 క్లబ్బులు తమ అంగీకారం తెలిపాయి. ఒడిశా ఎఫ్‌సీ మాత్రమే ఇంకా తుది నిర్ణయం ప్రకటించకపోవడంతో ఐఎస్‌ఎల్ భవితవ్యం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.


