కలం, జగిత్యాల: సౌత్‌జోన్ నేషనల్ అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం గోడిశాలపేట (Godishelpet) జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో పతకాలు సాధించి నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్-16 జావెలిన్ త్రో విభాగంలో జి. రిషిత బంగారు పతకం సాధించగా, హరిత కాంస్య పతకం కైవసం చేసుకుంది. ట్రయథ్లాన్ విభాగంలో ఎస్. సాయిశ్రీయా రజత పతకం, ఎం. సహస్ర కాంస్య పతకం సాధించారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో పాఠశాలలో సంబరాలు నెలకొన్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
పీఈటీ లేకున్నా.. అథ్లెటిక్స్‌లో శిక్షణ
గోడిశాలపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రస్తుతం పీఈటీ లేకపోయినా, పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు ఎం. కిషోర్ విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది నుంచి విద్యార్థులకు అథ్లెటిక్స్‌లో నిరంతరం శిక్షణ ఇస్తూ మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. సరైన సౌకర్యాలు, ప్రత్యేక పీఈటీ లేకపోయినా కిషోర్ కృషి, విద్యార్థుల పట్టుదలతో ఈ విజయాలు సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కోచ్ ఎం. కిషోర్ మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామం దాటి కూడా వెళ్లని విద్యార్థులు నేడు మండల, జిల్లా స్థాయిలను అధిగమించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి నిరంతరం శిక్షణ అందిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు అభినందనలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ అమృత రాజేశం, ప్రధానోపాధ్యాయురాలు జయ, ఎస్‌ఎంసీ చైర్మన్ లత, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి శిక్షణ అందించిన కిషోర్ ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో వారికి మరింత ప్రోత్సాహం అందిస్తామని గ్రామస్థులు తెలిపారు.

