Mobile Popup Ad
Mobile Popup Ad

కంచే చేను మేస్తే.. వరంగల్‌లో రెవెన్యూ అధికారి భూదందా!

కలం, వరంగల్ బ్యూరో: ‘కంచే చేను మేస్తే..’ అన్న చందంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారే.. ఆ భూములను కబ్జా పెట్టి, ప్లాట్ల దందా చేసిన ఉదంతమిది. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో జరిగిన ఈ భూబాగోతం (Warangal Land Scam)లో రెవెన్యూ అధికారి ప్రధాన పాత్ర పోషించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు జిల్లా రాజకీయ, రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. రెవెన్యూ శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకుని నిషేధిత జాబితాలోని భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేసి రూ.కోట్లల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉన్నతాధికారి సహకారంతోనే..

మామునూరు ఎయిర్‌పోర్టుకు సమీపంలోని భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎయిర్‌‌పోర్ట్ పనులు చురుగ్గా సాగుతుండడంతో నిన్న మొన్నటి వరకు రూ.లక్షల విలువ చేసిన భూములు.. ఇప్పడు రూ.కోట్లు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తిమ్మాపూర్ గ్రామ సర్వే నెంబర్ 188లోని ఎకరం 20 గుంటల సీలింగ్ ల్యాండ్‌పై అక్రమార్కుల కన్నుపడింది. ఇది నిషేధిత జాబితాలో ఉన్న భూమి. ఈ భూమిపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా గతంలో తహసీల్దార్, ఆర్‌డీవో, అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆదేశాలు జారీ అయ్యాయి.

భూభారతి, రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లోనూ ఈ భూమి నిషేధిత జాబితాలోనే ఉంది. అయితే ఆ ఆదేశాలన్నింటినీ పక్కనబెట్టిన ఓ రెవెన్యూ అధికారి.. సదరు భూమికి రిజిస్ట్రేషన్‌లు, మ్యుటేషన్‌లకు మార్గం సుగమం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ నిబంధన మేరకు ఏదైనా భూమిని రిజిస్ట్రేషన్ లేదా మ్యూటేషన్ చేసే ముందు ఆ గ్రామ క్లస్టర్ పరిధిలోని ఆర్ఐ రెకమెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ తిమ్మాపూర్‌‌లోని 188 సర్వే నెంబర్‌‌లోని నిషేధిత భూమిని సంబంధిత క్లస్టర్ ఆర్ఐతో కాకుండా వేరే క్లస్టర్ ఆర్ఐతో రికమెండ్ చేయించిన సదరు రెవెన్యూ అధికారి.. భూ ఆక్రమణకు తెరలేపినట్లు సమాచారం.

అది సీలింగ్ భూమి కావడంతో సంబంధిత క్లస్టర్ ఆర్ఐ నిరాకరించిన కారణంగా వేరే క్లస్టర్ ఆర్‌‌ఐతో రికమెండ్ చేయించి అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా ఆ భూమిని నాన్ లేఔట్ కింద గుంటల చొప్పున ప్లాట్లు చేసి విక్రయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో దాదాపు రూ.6 కోట్ల వరకు చేతులు మారినట్లు స్థానికంగా చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారంలో సదరు అధికారికి ఓ ఉన్నతాధికారి పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు సమాచారం. దీనికి కృతజ్ఞతగా ఆ అధికారికి భారీ మొత్తంలోనే డబ్బులు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.

డిప్యూటేషన్ వెనుక భారీ స్కెచ్?

సాధారణ బదిలీపై కాకుండా డిప్యూటేషన్‌పై ఖిలా వరంగల్‌కు వచ్చిన ఈ రెవెన్యూ అధికారి.. వచ్చీ రావడంతోనే భూదందాలకు తెరలేపారని, తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను బినామీలుగా రంగంలోకి దించి, నిషేధిత భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలకు పూర్తి సహకారం అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయంలో ఫైల్ కదలాలంటే ‘సెట్టింగ్‌లు’ ముఖ్యం అన్న తరహాలో వ్యవహారాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మంత్రి పేరు చెప్పి దందా!

ఈ వ్యవహారంలో ఓ మంత్రి పేరును సదరు రెవెన్యూ అధికారి వాడుకున్నారు. ‘నా వెనకాల మంత్రి ఉన్నారు.. నన్నెవరూ ఏమీ చేయలేరు’ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారని రెవెన్యూ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. మంత్రి పేరు చెప్పుకుంటూ ఆయన వివాదాస్పద భూముల సెటిల్‌మెంట్లకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కలెక్టర్ స్పందించేనా?

కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురైనట్టు ఆరోపణలు వస్తున్నా జిల్లా యంత్రాంగం మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆరోపణలపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌లు వస్తున్నాయి. ఇది కేవలం తిమ్మాపూర్ సర్వే నెంబర్ 188 వ్యవహారానికి సంబంధించిన మచ్చుతునక మాత్రమేనని, లోతుగా విచారణ చేస్తే మండలంలో జరిగిన మరికొన్ని భూ సెటిల్‌మెంట్లు వెలుగులోకి వస్తాయనే మాటలు వినిపిస్తున్నాయి.

గుంటల లెక్క అమ్మకం

– తిమ్మాపూర్ గ్రామ సర్వే నెంబర్ 188లోని ఎకరం 20 గుంటల సీలింగ్ ల్యాండ్‌ నిషేధిత జాబితాలో ఉన్నది.
– ఆ భూమికి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌లకు సదరు రెవెన్యూ అధికారి మార్గం సుగమం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
– దీన్ని నాన్ లేఔట్ కింద గుంటల చొప్పున ప్లాట్లు చేసి విక్రయించి, దాదాపు రూ.6 కోట్లు సంపాదించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>