కలం, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా ఆస్పత్రి.. రోజూ వేలాది మంది రోగులు చికిత్స కోసం వచ్చి వెళ్తుంటారు. వందలాది మంది ఇన్ పేషెంట్లుగా ట్రీట్మెంట్ పొందుతుంటారు. అలాంటి హాస్పిటల్‌లో ఇప్పటికే 131 నర్సింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి తోడు తాజాగా జనరల్ బదిలీల్లో ఇక్కడి నుంచి 52 మంది సీనియర్ స్టాఫ్‌ను జిల్లాలకు పంపారు. వారి ప్లేస్‌లో కొత్తగా ఎవరైనా వచ్చారా అంటే.. జీరో!
గాంధీ హాస్పిటల్ లోనూ ఇదే పరిస్థితి. ఖాళీలు 66 ఉంటే.. ఇక్కడి నుంచి 82 మంది బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చింది కేవలం ఇద్దరే. పిల్లలకు వైద్యం అందించే నిలోఫర్ దవాఖానలో 124 ఖాళీలు ఉంటే.. దానికి తోడు బదిలీపై వెళ్లింది మరో 40 మంది. వచ్చింది.. సున్న!
హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వాస్పత్రులను తాజాగా చేపట్టిన బదిలీలు పెనం మీది నుంచి పొయ్యిలోకి పడ్డట్టు చేశాయి. ఇప్పటికే ఖాళీలతో ఇబ్బందులు పడుతున్న ఈ హాస్పిటల్స్ నుంచి ఇప్పుడు అనుభవజ్ఞులైన సిబ్బంది వెళ్లిపోవడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. రోజువారీ జరిగే సర్జరీల్లో మూడొంతులు తగ్గిపోయాయి. డయాగ్నస్టిక్ సర్వీసుల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.
సర్జరీ మొదలు ఇన్ పేషెంట్లకు సర్వీస్ అందించడం వరకు సీనియర్లుగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్లను ‘నాలుగేండ్ల లాంగ్ స్టాండింగ్’ పేరుతో ఇటీవల సిటీ నుంచి గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఫలితంగా ఒకవైపు అనుభవం ఉన్న నర్సింగ్ స్టాఫ్ లేక సిటీ హాస్పిటల్స్‌లో సేవలకు ఆటంకాలు కలుగుతుంటే.. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని గ్రామీణ హాస్పిటల్స్‌కు సీనియర్లను పంపడంతో వారు అక్కడ చేసేదేమీ లేక ఖాళీగా ఉంటున్నారన్న వాదన ఉంది. అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని స్టాఫ్ కూడా అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల ప్రభావం వైద్యారోగ్య వ్యవస్థపై తీవ్రంగా పడింది. హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రుల్లో రోజువారీ అందే సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఖాళీలతో సతమతమవుతున్న ఈ ఆస్పత్రులు తాజాగా బదిలీమీద వందలాది మంది నర్సింగ్ ఆఫీసర్లు వెళ్లిపోవడంతో ఇన్ పేషెంట్లకు అందించే సర్వీస్ మొదలు ఎమర్జెన్సీ ఆపరేషన్ల వరకు ఎఫెక్ట్ కు గురవుతున్నాయి. ప్రజలతో నేరుగా రోజూ కనెక్ట్ అయ్యే ఆస్పత్రుల్లో బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం ప్రాక్టికల్ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గైడ్‌లైన్స్ జారీచేయడం ఆనవాయితీ.
కానీ, ఈసారి మాత్రం వాటిని పట్టించుకోకుండా అడ్మినిస్ట్రేటివ్ విభాగాలకు, పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్‌కు ఒకే తరహా నిబంధనలు పెట్టడంతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. వెయ్యికి పైగా బెడ్స్ సామర్థ్యమున్న గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర ప్రధాన ఆస్పత్రులతో పాటు ఈఎన్టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రులకు వేర్వేరు స్థాయిల్లో జనరల్ ట్రాన్స్ ఫర్స్ ప్రక్రియతో చిక్కులు తలెత్తాయి.
అధికారుల అనాలోచిత నిర్ణయం!
జనరల్ ట్రాన్స్‌ఫర్ పేరుతో ప్రభుత్వం గత నెలలో భారీ స్థాయిలో ఉద్యోగులను బదిలీ చేసింది. ఆ ప్రక్రియలో భాగంగా వైద్యారోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలూ జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో పని చేస్తున్న 1,166 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రజల వైద్య అవసరాలను పరిగణనలోకి తీసుకుని సాధారణ బదిలీల విషయంలో ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తే ఆస్పత్రుల్లో సేవలకు ఇబ్బంది ఉండేది కాదని డిపార్టుమెంట్లోనే చర్చ జరుగుతున్నది. బదిలీల కారణంగా సీనియర్ స్టాఫ్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లిపోయారు.
ఈ స్థానంలో 2024, 2026 బ్యాచ్ స్టాఫ్‌ను పాక్షికంగా బదిలీ చేయడంతో.. వారికి తగినంత అనుభవం లేని కారణంగా సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజువారీ జరిగే సర్జరీల్లో మూడొంతులు తగ్గిపోయాయి. డయాగ్నస్టిక్ సర్వీసుల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తున్నది. మిగిలిన డిపార్టుమెంట్ల తరహాలో కాకుండా వైద్యారోగ్య విభాగంలో అధికారులు భిన్నంగా ఆలోచించి ప్రజలకు అందే సేవలకు ఇబ్బంది లేకుండా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సిబ్బందిలో వ్యక్తమవుతున్నది.
సీలింగ్ 40 శాతానికి పెంచడంతో..!
– గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో చేపట్టిన జనరల్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియలో వైద్యారోగ్య శాఖలో బదిలీలను 20 శాతానికే పరిమితం చేసింది.
– ఈసారి దాన్ని 40 శాతానికి పెంచడంతో ఎక్కువగా 2021 బ్యాచ్ నర్సింగ్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాలకు, ఇతర చోట్లకు బదిలీ అయ్యారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినీదేవి, పేట్ల బురుజు, ఫీవర్ ఆస్పత్రికి వచ్చిన నర్సింగ్ ఆఫీసర్ల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పటికే ఖాళీలతో సతమతమవుతున్న ఈ ప్రధాన ఆస్పత్రులు తాజాగా బదిలీలతో స్టాఫ్ ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో రోజువారీ కార్యకలాపాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
– వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు తాజా బదిలీల్లో భాగంగా గాంధీ ఆస్పత్రి నుంచి 82 మంది వేరే చోటకు వెళ్లిపోతే ఇద్దరు మాత్రమే వచ్చారు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి 52 మంది వెళ్లిపోతే ఒక్కరు కూడా రాలేదు. అత్యధికంగా ఈ ఆస్పత్రిలో 131 ఖాళీలు ఉన్నాయి.
– నిలోఫర్ ఆస్పత్రిలో ఆల్రెడీ 124 ఖాళీలు ఉంటే బదిలీల్లో 40 మంది వెళ్లిపోయారు. ఒక్కరు కూడా అదనంగా రాలేదు. హైదరాబాద్ నగరంలోని దాదాపు ప్రధాన ఆస్పత్రులన్నింటి పరిస్థితి ఇదే తరహాలో ఉన్నది.
సౌకర్యాలు లేని ఆస్పత్రుల్లోకి సీనియర్లు
ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ మొదలు ఇన్ పేషెంట్లకు సర్వీస్ అందించడం వరకు సీనియర్లుగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్లను ‘నాలుగేండ్ల లాంగ్ స్టాండింగ్’ పేరుతో గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయడంతో సిటీలోని మేజర్ టీచింగ్ ఆస్పత్రుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. సీనియర్లతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక, ఏరియా ఆస్పత్రుల్లో మంచి సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా అక్కడ తగిన మౌలిక సౌకర్యాలే లేకుండా పంపడంతో వారు ఖాళీగా ఉంటున్నారని, వారి సేవలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నదన్న అభిప్రాయాలు సిబ్బందిలోనే వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ లక్ష్యానికి తగినట్లుగా అధికారులు బదిలీ నిబంధనలను రూపొందించలేకపోయారని, గ్రౌండ్ రియాలిటీకి తగినట్లుగా బదిలీలు జరిగితే ఈ కొత్త సంక్షోభం తలెత్తేది కాదన్నది వారి వాదన. గత ప్రభుత్వంలో ఒక రకమైన సమస్య తలెత్తితే.. ఇప్పుడు మరో రూపంలో వైద్య రంగానికి ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు.
ఇక డిప్యూటేషన్‌లే ఏకైక మార్గమా?
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల నాణ్యతను పెంచడం, అనుభవజ్ఞులైన సిబ్బంది అందుబాటులో ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యం అధికారుల నిర్ణయాలతో ఆమడ దూరంలోనే ఉండిపోయింది. హైదరాబాద్‌లోని ప్రధాన టీచింగ్ ఆస్పత్రులు ప్రతి రోజూ వేలాది మంది రోగులకు సేవలందించే సూపర్ స్పెషాలిటీ కేంద్రాలు. వీటిలో పని చేసే నర్సింగ్ ఆఫీసర్లు వార్డు సేవలకే పరిమితం కాకుండా.. కార్డియాక్, న్యూరో సర్జరీలతో పాటు ట్రామా కేర్, ఐసీయూ నిర్వహణ, నియోనేటల్ కేర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు, ఆంకాలజీ సేవలు తదితర స్పెషాలిటీ సర్వీసులు అందిస్తారు.
దీర్ఘకాలంగా ఈ విభాగాల్లో పనిచేస్తున్నందున అనుభవం కూడా వచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో బదిలీపై వెళ్లిపోవడంతో వారి స్థానాల్లో తగిన అనుభవం ఉన్న సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగింది. సూపర్ స్పెషాలిటీ, క్రిటికల్ కేర్ సేవల్లో శిక్షణ పొందిన, అనుభవం ఉన్న నర్సింగ్ ఆఫీసర్లు జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోకి బదిలీ అయినందున అక్కడ అవసరమైన మౌలిక వసతులు లేకపోవడంతో వారి సేవలు పరిమిత స్థాయిలోకి కుదించినట్లయింది.
మౌలిక వసతుల్లో పట్టణ, పల్లెల మధ్య అగాధం
– తాజా బదిలీలతో హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలకు అవసరమైన అనుభవం ఉన్న సిబ్బంది సంఖ్య తగ్గిపోతుండగా, గ్రామీణ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోవడంతో వారి నైపుణ్యానికి తగినట్లుగా వాడుకోలేకపోతున్నది ప్రభుత్వం. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఉండే మౌలిక వసతులు జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో లేకపోవడం ఇందుకు కారణం.
– ఆస్పత్రుల పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు డాక్టర్లు, నర్సుల బదిలీలను గత ప్రభుత్వం 20% మించొద్దన్న నిబంధన పెట్టింది. కానీ ఇప్పుడు 40 శాతానికి పెరిగిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. పట్టణ, గ్రామీణ ఆస్పత్రుల్లోని మౌలిక సౌకర్యాలు, ఎక్విప్‌మెంట్ విషయంలో అధికారులు గ్రౌండ్ రియాలిటీని పరిగణనలోకి తీసుకున్నట్లయితే బదిలీ సందర్భంగా తగిన నిబంధనలు పెట్టడానికి అవకాశం ఉండేది.
– ఒకవైపు సిటీలోని టీచింగ్ ఆస్పత్రుల్లో నర్సింగ్ పోస్టుల కొరత ఉన్న సమయంలో బదిలీలు చేపట్టడం సమస్యను తీవ్రం చేసింది. పోస్టులు ఖాళీగా ఉండటం, రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య సేవల్లో పరిమితులు ఏర్పడ్డాయి. కొత్త విభాగాల ఏర్పాటు కావడంతో పని భారం కూడా పెరిగింది.
– పబ్లిక్ హెల్త్ నిబంధనల ప్రకారం ప్రతీ వంద బెడ్‌లకు 45 మంది నర్సింగ్ ఆఫీసర్లు, ప్రతీ 30 బెడ్‌లకు ఒక సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ (ఇన్‌చార్జి), ప్రతీ పది మంది ఇన్‌చార్జిలకు ఒక అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, ప్రతీ 300 బెడ్‌లకు ఒక డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, ప్రతీ 400 బెడ్‌లకు ఒక నర్సింగ్ సూపరింటెండెంట్ ఉండాలి. కానీ దానికి తగినట్లుగా రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో సిబ్బంది లేరు.
రీజినల్ నర్సింగ్ డైరెక్టర్లు లేనందువల్లనే.. :
“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ కేంద్రాలుగా ఇద్దరు నర్సింగ్ సూపరింటెండెంట్లు ఉండేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ వ్యవస్థ కనుమరుగైంది. దీంతో నర్సుల ఇబ్బందులు, ఆస్పత్రుల్లోని అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే మెకానిజం కరువైంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఫోకస్ ఎక్కువగా డాక్టర్ల మీద ఉండడంతో నర్సింగ్ స్టాఫ్ సమస్యలకు పరిష్కారం కరువైంది. తాజాగా జరిగిన బదిలీల్లో అది కనిపిస్తున్నది.
ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రికి క్షేత్రస్థాయి అవసరాలు, పరిస్థితిని వివరించాల్సిన అధికారులు విఫలం కావడంతో పాటు బదిలీ నిబంధనల రూపకల్పనలో నిర్లక్ష్యం కారణంగా ప్రజారోగ్యం, ట్రీట్‌మెంట్ సర్వీసుల్లో ప్రతిష్టంభన నెలకొన్నది. సీనియర్లుగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల సేవలు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించుకోగలిగితే ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ, అక్కడి ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకుండా బదిలీ చేయడంతో వారికి పని లేకుండా టైమ్ పాస్‌కు పరిమితమయ్యారు.’’
– ఎస్‌కే ప్రసన్న, ఐఎన్‌టీయూసీ స్టేట్ సెక్రటరీ (నర్సింగ్ విభాగం)
టీచింగ్ ఆస్పత్రుల్లో ఖాళీలు, తాజా బదిలీల (నర్సింగ్ ఆఫీసర్లు) వివరాలు :
ఉస్మానియా ఆస్పత్రి :
• ఖాళీలు : 131
• బదిలీపై వెళ్లింది : 52 మంది
• కొత్తగా వచ్చింది : 0
గాంధీ ఆస్పత్రి :
• ఖాళీలు : 66
• బదిలీపై వెళ్ళింది : 82 మంది
• కొత్తగా వచ్చింది : 2
నిలోఫర్ ఆస్పత్రి :
• ఖాళీలు : 124
• బదిలీపై వెళ్ళింది : 40 మంది
• కొత్తగా వచ్చింది : 0
సరోజినీదేవి కంటి ఆస్పత్రి :
• ఖాళీలు : 72
• బదిలీపై వెళ్ళింది : 51 మంది
• కొత్తగా వచ్చింది : 1
ఫీవర్ ఆస్పత్రి :
• ఖాళీలు : 22
• బదిలీపై వెళ్ళింది : 18 మంది
• కొత్తగా వచ్చింది : 0

