కలం, హెల్త్: మీ ఉదయం కప్పు కాఫీతో (Coffee) మొదలవుతుందా? అయితే మీ గుండె రిథమ్‌పై దాని ప్రభావం గురించి మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ప్రతి రోజూ చాలా మంది కాఫీ తాగుతుంటారు. వారిలో చాలా మందికి కాఫీ తాగడం మనకు, మన గుండెకు మంచిదేనా అన్న సందేహాలు కూడా వస్తుంటాయి. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగే వారిలో ఈ సందేహం మరింత లోతుగా ఉంటుంది. కాగా తాజాగా కాఫీకి, గుండెకు (Heart) మధ్య ఉన్న సంబంధాన్ని హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్‌ఏంజెలస్(UCLA) వంటి టాప్ యూనివర్సిటీల్లో శిక్షణ పొందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ హఫీజా ఖాన్ విడమరిచి చెప్పారు. ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో వచ్చిన ఒక తాజా స్టడీని ఉటంకిస్తూ, మనం తాగే కాఫీ మన బాడీని ఎలా ఆడిస్తుందో ఆమె విశ్లేషించారు.
వంద మంది హెల్తీ వాలంటీర్లపై జరిగిన ఈ ప్రయోగంలో కొన్ని ఆసక్తికరమైన నిజాలు బయటపడ్డాయి. కాఫీ తాగిన రోజుల్లో జనాలు మునుపటి కంటే చురుగ్గా మారి, రోజుకు వెయ్యి అడుగులు అదనంగా వేశారు. వినడానికి ఇది బాగున్నా, నాణేనికి మరో వైపు కూడా ఉంది. కెఫీన్ కిక్కులో ఉన్నప్పుడు ఆ రాత్రి నిద్ర సగటున 30 నిమిషాలు తక్కువైందని అధ్యయనంలో తేలింది. నిద్రకు, కాఫీకి ఉన్న పాత గొడవ మరోసారి ఈ స్టడీతో నిరూపితమైంది.
ఇక గుండె కొట్టుకునే వేగం విషయానికొస్తే, కాఫీ తాగడం వల్ల గుండె పైభాగం నుంచి వచ్చే అదనపు బీట్స్ (Atrial Beats) పెరగలేదు. కానీ, గుండె కింది భాగం నుంచి వచ్చే ఎక్స్‌ట్రా బీట్స్ (PVC) సంఖ్యలో పెరుగుదల కనిపించింది. అంటే, కాఫీ గుండెను కొంచెం వేగంగా పరుగెత్తిస్తుంది కానీ, అది భయపడాల్సిన రేంజ్‌లో లేదని డాక్టర్ స్పష్టం చేశారు. అలాగే, నాన్-డయాబెటిక్ వ్యక్తుల్లో షుగర్ లెవల్స్‌పై కాఫీ ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ చూపలేదు.
బాటమ్ లైన్ ఏంటంటే: రోజుకు 1 నుంచి 3 కప్పుల బ్లాక్ కాఫీ గుండెకు సేఫ్. కానీ, కాఫీ పేరుతో మీరు తాగే భారీ షుగర్ డ్రింక్స్, క్యారమెల్ లాటేలు, క్రీమ్ లోడెడ్ పానీయాలు అసలు సేఫ్ కావు. అలాగే ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కృత్రిమ కెఫీన్‌ను కాఫీతో పోల్చకూడదని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. కాఫీ ప్రకృతి ప్రసాదించిన వరమైతే, ఎనర్జీ డ్రింక్స్ ముప్పు అని ఆమె గుర్తు చేశారు.
మొత్తానికి, మీ కాఫీ కప్పులో కేవలం కాఫీ మాత్రమే ఉంటే మీ గుండె పదిలం. కానీ నిద్ర విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. పరిమితంగా తీసుకుంటే కాఫీ మీకు శక్తినిచ్చే ఇంధనం, అతిగా తాగితే అది నిద్రను దూరం చేసే అలారం.

