పుచ్చకాయ తింటే చనిపోతారా? వైరల్ వార్తలపై డాక్టర్ల క్లారిటీ!

కలం, వెబ్‌డెస్క్: వేసవి అనగానే మనకు గుర్తొచ్చే పండ్లలో పుచ్చకాయ (Watermelon) కూడా ఒకటి. ఈ పండు వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని, తగినంత నీటి శాతాన్ని అందించే అద్భుతమైన పండు. అయితే ఇటీవలి కాలంలో పుచ్చకాయ తిని కొందరు మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో జనాలు పుచ్చకాయను తీసుకునేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు స్పందిస్తూ భయాల వెనుక ఉన్న అసలు నిజాలను, శాస్త్రీయ కారణాలను విశ్లేషించారు. పిల్లల నుంచి పెద్దల వరకు పుచ్చకాయను అందరూ ఇష్టపడతారు. అయితే పుచ్చకాయ తిని కొందరు మరణించారనే వార్తలతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు స్పందించారు. పుచ్చకాయ తింటే నిజంగా మరణిస్తారా? వాటి వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో జనాలకు అవగాహన కల్పించేందుకు వాస్తవాలను వెల్లడించారు.

సహజంగా పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. కాబట్టి పుచ్చకాయ తినడం వల్ల ఎవరూ మరణించరని స్పష్టం చేశారు. పుచ్చకాయలో 92 శాతం నీరు, ఎన్నో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి, ఇది ఆరోగ్యానికి ఎంతో సురక్షితమైనది. అయితే, మరణాలకు దారితీసే కొన్ని ప్రత్యేక పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఆరోగ్యకరమైన పుచ్చకాయ ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారుతుందో వైద్యులు వివరించారు.

పుచ్చకాయ ప్రాణాంతకమా? వైద్యుల వివరణ

  • రసాయనాలు, ఇంజక్షన్లు ఉపయోగించినపుడు..

నేటి కాలంలో వ్యాపారులు ఆరోగ్యానికంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది వ్యాపారులు పుచ్చకాయలు త్వరగా పండటానికి, లోపల ఎర్రగా మారడానికి ఎరిథ్రోసిన్ వంటి ప్రమాదకరమైన రసాయన రంగులను లేదా ఇంజక్షన్లను ఉపయోగిస్తారు. ఇలాంటి కెమికల్స్ ఉన్న పండ్లను తిన్నప్పుడు శరీరంలో తీవ్రమైన టాక్సిన్లు (విషపదార్థాలు) చేరి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది.

  • కోసిన పండ్లను ఎక్కువ సేపు నిల్వ ఉంచడం

మనం కొన్నిసార్లు పుచ్చకాయలో కొంత భాగాన్ని తిని మిగిలింది అలానే ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట పెడతాం. అటువంటి సమయంలో పుచ్చకాయపై బ్యాక్టీరియా (ముఖ్యంగా సాల్మొనెల్లా) వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన పండు తినడం వల్ల వాంతులు, విరేచనాలు అయి, శరీరం డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

  • కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త

పుచ్చకాయలో (Watermelon) పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉన్నవారు దీన్ని అధికంగా తింటే, శరీరంలో పొటాషియం స్థాయిలు పెరిగి (హైపర్‌కలేమియా) గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందట.

పుచ్చకాయను కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పుచ్చకాయను కొనేటప్పుడు సహజమైన రంగు, ఆకృతి ఉన్నవాటినే ఎంచుకోండి. మరీ విపరీతమైన ఎరుపు రంగు ఉంటే అనుమానించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. పండును కోసే ముందు శుభ్రంగా కడగాలి. కోసిన తర్వాత తాజా ముక్కలను వెంటనే తినేయాలి, ఎక్కువ రోజులు లేదా ఎక్కువ గంటలు నిల్వ ఉంచిన ముక్కలను అస్సలు తినకూడదు. అంతేగానీ, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. పుచ్చకాయలో తప్పు లేదు, కానీ దాన్ని మనం ఎంచుకునే విధానం, తినే పద్ధతిలోనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి పై జాగ్రత్తలు పాటిస్తూ పుచ్చకాయ లవర్స్ హ్యామీగా తినేయచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Read Also: చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు.. వయసు పెరిగినా చురుగ్గా ఉంచే ‘మైక్రో హాబిట్స్’

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>